దిమిలి కేంద్రంగా ఉప్పు సత్యాగ్రహం

ABN , First Publish Date - 2022-08-13T05:53:45+05:30 IST

బ్రిటీష్‌ పాలకుల నుంచి దేశాన్ని విముక్తిచేయడానికి మహాత్మా గాంధీజీ పిలుపునందుకొని రాంబిల్లి మండలం దిమిలి గ్రామం నుంచి పలువురు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన, సహాయ నిరాకరణ, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు.

దిమిలి కేంద్రంగా ఉప్పు సత్యాగ్రహం
దిమిలి గ్రామం వ్యూ

భారత జాతీయ కాంగ్రెస్‌ విశాఖ జిల్లా కమిటీ పిలుపు

ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు

పలువురిని అరెస్టు చేసి జైళ్లకు తరలించిన బ్రిటీష్‌ పాలకులు


అచ్యుతాపురం, ఆగస్టు 12: బ్రిటీష్‌ పాలకుల నుంచి దేశాన్ని విముక్తిచేయడానికి మహాత్మా గాంధీజీ పిలుపునందుకొని రాంబిల్లి మండలం దిమిలి గ్రామం నుంచి పలువురు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన, సహాయ నిరాకరణ, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి జైళ్లకు తరలించారు.  ప్రధానంగా ఉప్పు సత్యాగ్రహానికి ఈ గ్రామం వేదిక అయ్యింది. భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) పార్టీ విశాఖ జిల్లా కమిటీ దిమిలి గ్రామాన్ని ఎంపిక చేసింది. గ్రామానికి చెందిన మిస్సుల వీర వెంకట సత్యనారాయణ, ఆయన భార్య లక్ష్మీనరసమ్మ, శిష్ల్టా రామదాసు, ఎంవీవీ సత్యనారాయణ, డబ్మీరు భారత్‌రావు, శానాపతి అప్పలనాయుడు, తదితరులు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఎంవీవీ సత్యనారాయణ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి ఎంబీబీఎస్‌ మొదటి మొదటి సంవత్సరంలోనే  చదువు  మానివేశారు. బ్రిటీషు ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ దిమిలి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో పోలీసులు మిస్సుల వీర వెంకట సత్యనారాయణ, ఆయన భార్య లక్ష్మీనరసమ్మను అరెస్టుచేసి జైలుకి పంపారు. ఆ సమయానికి లక్ష్మీనరసమ్మ గర్భవతి. జైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు స్వరాజ్యం అని పేరుపెట్టారు. మరో ఉద్యమకారుడు శిష్ట్లా రామదాసును బ్రిటీషు పోలీసులు కొక్కిరాపల్లి సమీపంలో అరెస్టు చేసి జైలుకి పంపారు. స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా 1972లో భారత ప్రభుత్వం విశాఖ జిల్లా నుంచి దిమిలికి చెందిన శిష్ట్లా రామదాసుతోపాటు అల్లూరి సీతారామరాజు అనుచరుడు వీరయ్య దొరలను ఢిల్లీకి ఆహ్వానించి ఘనంగా సత్కరించింది. 


Updated Date - 2022-08-13T05:53:45+05:30 IST