ఆర్టీసీ ప్రయాణికుల పాట్లు

ABN , First Publish Date - 2022-12-31T01:48:05+05:30 IST

పీటీడీ/ఆర్టీసీ బస్సుల్లో సింహభాగం నర్సీపట్నంలోని సీఎం సభకు జనాన్ని తరలించేందుకు కేటాయించడంతో శుక్రవారం నగరంలోని ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

ఆర్టీసీ ప్రయాణికుల పాట్లు

నగరంలో మూడో వంతు బస్సులు సీఎం సభకు జనాన్ని తరలించేందుకు కేటాయింపు

సిటీలో రెగ్యులర్‌ సర్వీసులు 564

ముఖ్యమంత్రి సభకు 360...

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు,

విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగులు అగచాట్లు

ద్వారకా బస్‌స్టేషన్‌, డిసెంబరు 30:

పీటీడీ/ఆర్టీసీ బస్సుల్లో సింహభాగం నర్సీపట్నంలోని సీఎం సభకు జనాన్ని తరలించేందుకు కేటాయించడంతో శుక్రవారం నగరంలోని ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గంటలకొద్దీ బస్టాపుల్లో వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందిపడ్డారు. అడపాదడపా ఒకటో, రెండో బస్సులు వచ్చినా...అప్పటికే అవి కిక్కిరిసి వుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఆశ్రయించారు.

విశాఖ రీజియన్‌లో 804 బస్సులు ప్రతిరోజూ రవాణా సేవలందిస్తుండగా హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, భీమవరం, నెల్లూరు తదితర దూరప్రాంతాలకు 80, జోనల్‌ పరిధిలోని కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, విజయనగరం, బొబ్బిలి సాలూరు, పార్వతీపురం, రాజాం ప్రాంతాలకు 160 బస్సులు నడుస్తున్నాయి. నగర పరిధిలో 564 సర్వీసులు సేవలందించాల్సి ఉండగా...వీటిలో ఏకంగా 360 సర్వీసులను సీఎం సభకు జనాలను తరలించేందుకు వినియోగించారు. మిగిలిన 204 సర్వీసులను సిటీలోని అన్ని రూట్లకు సర్దుబాటు చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. దీంతో బస్సుల కొరత ఏర్పడింది.

బస్‌ పాస్‌లు ఉన్నా...

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు బస్టాపుల్లో గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ఎప్పటికో ఒక బస్సు వచ్చినా ఫుట్‌బోర్డుపై ప్రయాణికులు వేలాడుతుండడంతో, ప్రయాణించే పరిస్థితి కనిపించలేదు. దీంతో పాస్‌ వున్నా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చిందని వాపోయారు. మధురవాడ ప్రాంతంలో ఎక్కువగా విద్యా సంస్థలున్నాయి. అటు వైపు వెళ్లేందుకు బస్సులు లేక ద్వారకా నగర్‌ ఆర్టీసీ కాంప్లెక్సు, మద్దిలపాలెం కాంప్లెక్సు, హనుమంతువాక బస్టాపుల్లో విద్యార్థులు గంటల కొద్దీ వేచి చూశారు. నగరం నుంచి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస ప్రాంతాలకు వెళ్లేవారు, ఆయా ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. గాజువాక, సింథియా రూట్లలోను ఇదే పరిస్థితి. శుక్రవారం ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. విద్యార్థులు సాయంత్రం ఇళ్లకు చేరేందుకు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

Updated Date - 2022-12-31T01:48:05+05:30 IST

Read more