రోడ్డు విస్తరణ నత్తనడక

ABN , First Publish Date - 2022-12-31T01:20:41+05:30 IST

రోడ్డు విస్తరణ నత్తనడకరోడ్డు విస్తరణ నత్తనడకరోడ్డు విస్తరణ నత్తనడకరోడ్డు విస్తరణ నత్తనడక

రోడ్డు విస్తరణ నత్తనడక
అధ్వానంగా ఉన్న చోడవరం రోడ్డు

ఫొటోరైటప్స్‌ః

29సీడీఎం1: అధ్వానంగా ఉన్న చోడవరం రోడ్డు

29సీడీఎం4: గంధవరం వద్ద తొలగించని చెట్లు

మందకొడిగా బీఎన్‌ రోడ్డు పనులు

చెట్ల తొలగింపులో తీవ్ర జాప్యం

ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి

చోడవరం, డిసెంబరు 30: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులతో నియోజకవర్గంలో చేపట్టిన బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. రహదారి పక్కనున్న చెట్లు తొలగించి, విద్యుత్‌ లైన్లు మారిస్తే తప్ప రోడ్డు విస్తరణ పనులు జరగవు. తొలుత వేగంగా జరిగిన చెట్ల తొలగింపు కార్యక్రమం కొద్ది రోజుల నుంచి నెమ్మదించింది.

మండలంలోని గంధవరం నుంచి రావికమతం మండలం టి.అర్జాపురం వరక న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులు రూ.113 కోట్లతో మూడేళ్ల క్రితం ప్రారంభం కావలసిన ఈ రహదారి విస్తరణ పనులు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు గత నెలలో గంధవరం వద్ద రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. గంధవరం నుంచి చోడవరం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు తొలగించిన తరువాత రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగాన్ని పరిశీలిస్తే చూస్తే మరో రెండేళ్లయినా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం గంధవరం నుంచి వెంకన్నపాలెం వరకు రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. వాస్తవానికి ఈ రహదారి విస్తరణ పనులకు మూడేళ్ల క్రితమే రుణం మంజూరైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించవలసిన నిధులు జమ చేయకపోవడంతో ఈ పనులు ప్రారంభంలో జాప్యం చోటు చేసుకుంది. ఇక ఆ తరువాత ఈ రోడ్డు పనులుకు గ్రహణం పట్టుకుంది. మధ్యలో రావికమతం సమీపంలో కొంత మేర పనులు చేపట్టినా, వాటికి రావలసిన బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌ తట్టాబుట్టా సర్దేసుకున్నారు. దీంతో ఈ రహదారి పనులు అసలు పూర్తవుతాయా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. కాగా రహదారి విస్తరణ పనుల జాప్యంపై స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ ఐదు నెలల క్రితం సంబధిత కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులపై తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, ఆందోళనకు కూడా సిద్ధమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రోడ్డు పనుల్లో కదలిక లేకపోయింది. చివరకు రోడ్డు పనులు ఆలస్యం చేసినా, కనీసం గోతులు కప్పాలని ఎమ్మెల్యే వేడుకోవలసిన దుస్థితి తలెత్తింది. అయినా గోతులు కూడా కప్పకపోవడంతో రోడ్డు అధ్వానంగా తయారై, ప్రయాణం దుర్భరంగా మారింది. చివరకు సొంత పార్టీ నేతలు కూడా మండల పరిషత్‌ సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతోఎట్టకేలకు గత నెలలో రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత గంధవరం నుంచి రహదారి వెడల్పు చేసే పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాలను తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులు కూడా నత్తనడకను సాగుతున్నాయి. చెట్లను తొలగించిన తరువాత విద్యుత్‌ లైన్లు మార్చాలి. ఆ తరువాతే రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడతారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అయ్యే సరికి వర్షాకాలం వచ్చేసినా ఆశ్చర్యపడనక్కరలేదని పనులు జరుగుతున్న తీరును చూసి స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-12-31T01:21:05+05:30 IST