ఇంటి స్థలం పేరుతో రోడ్డు అమ్మకం!
ABN , First Publish Date - 2022-12-16T00:48:57+05:30 IST
పంచాయతీ రహదారిని ప్లాటుగా చూపించి దానిని ఓ మాజీ సైనికుడికి విక్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘరానా మోసం ఆలస్యంగా బయటపడింది. దీనిపై బాఽధితుడు తర్రా కృష్ణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ సైనికుడికి రియల్ ఎస్టేట్ వ్యాపారి టోకరా
ఇంటి నిర్మాణ పనులు చేపట్టే సమయంలో బయటపడిన మోసం
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
చోడవరం, డిసెంబరు 15: పంచాయతీ రహదారిని ప్లాటుగా చూపించి దానిని ఓ మాజీ సైనికుడికి విక్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘరానా మోసం ఆలస్యంగా బయటపడింది. దీనిపై బాఽధితుడు తర్రా కృష్ణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోడవరం పట్టణానికి చెందిన వ్యాపారి పూసర్ల వెంకటేశ్ 1982వ సంవత్సరంలో గాంధీగ్రామం పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాల లేఅవుట్ వేశారు. పలువురు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశారు. సుమారు 33 ఏళ్ల తరువాత 2015లో వెంకటేశ్ కుమారుడు రాంజీ ఈ లే అవుట్లో ఓ స్థలం ఖాళీగా ఉందంటూ అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి తర్రా కృష్ణకు రూ.5 లక్షలకు విక్రయించాడు. అతని పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. కృష్ణ ఇటీవల ఈ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు చర్యలు చేపట్టగా, స్థానికులు అభ్యంతరం చెప్పారు. పంచాయతీ రహదారిలో ఇంటి నిర్మాణం ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు. రాంజీ తనను మోసం చేశాడని గ్రహించిన కృష్ణ.. డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని కోరారు. కానీ అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో ఐదుగురు బాధితులు
గాడి అప్పారావు, సర్పంచ్, గాంధీగ్రామం
పూసర్ల వెంకటేశ్ వేసిన లేఅవుట్లో అప్పట్లో చాలా మంది స్థలాలు కొనుక్కున్నారు. కొంతమంది ఇళ్లు నిర్మించుకోలేదు. రాంజీ చనిపోయిన తరువాత అతని కుమారుడు రాంజీ, మరికొందరు కలిసి, ఖాళీగా వున్న స్థలాలను వేరే వ్యక్తులకు విక్రయించారు. ఇప్పటి వరకు రాంజీ చేతిలో ఐదుగురు మోసపోయినట్టు తేలింది.
విచారణ చేపడతాం
బి. శ్రీనివాసరావు, సీఐ, చోడవరం
ఇంటి స్థలం కొనుగోలు విషయంలో పూసర్ల రాంజీ అనే వ్యక్తి తనను మోసగించినట్టు మాజీ సైనికుడు తర్రా కృష్ణ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర విచారణ చేపడతాం. మోసానికి పాల్పడినట్టు నిర్ధారణ అయితే కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు చేపడతాం.