ఏటికొప్పాక రోడ్డులో అడుగుకో గొయ్యి

ABN , First Publish Date - 2022-05-30T05:48:31+05:30 IST

మండలంలోని పులపర్తి జంక్షన్‌ నుంచి ఏటికొప్పాక గ్రామానికి వెళ్లే రహదారి పలుచోట్ల గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైంది

ఏటికొప్పాక రోడ్డులో అడుగుకో గొయ్యి
కోతకు గురై గోతులు ఏర్పడిన పులపర్తి జంక్షన్‌-ఏటికొప్పాక రోడ్డు

పులపర్తి- రైల్వే గేటు మధ్య పూర్తిగా ఛిద్రమైన రోడ్డు

కొరవడిన నిర్వహణ పనులు

రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు


ఎలమంచిలి, మే 29: మండలంలోని పులపర్తి జంక్షన్‌ నుంచి ఏటికొప్పాక గ్రామానికి వెళ్లే రహదారి పలుచోట్ల గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైంది. అంకుడు కర్రతో లక్కబొమ్మలు, అద్భుతమైన కళాఖండాల తయారీకి ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక గ్రామానికి ఇటీవల కాలంలో సందర్శకులు, కొనుగోలుదారుల రాకపోకలు బాగా పెరిగాయి. సుమారు ఏడు కిలోమీటర్ల దూరం వున్న ఈ రోడ్డు వెడల్పు తక్కువ వుండడంతోపాటు ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా పులపర్తి జంక్షన్‌ నుంచి రైల్వే గేటు వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ఈ రోడ్డు మీదుగా ఏటికొప్పాక వచ్చే ఇతర ప్రాంతాల వారితోపాటు ఆరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. చాలా కాలంగా ఈ రహదారికి ఎటువంటి మరమ్మతులు చేయడంలేదని, ఏటేటా గోతులు పెరిగిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కసారి ఈ రోడ్డులో ప్రయాణిస్తే... నిత్యం తాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అర్థం అవుతుందని ఆవేదనతో చెబుతున్నారు.


Updated Date - 2022-05-30T05:48:31+05:30 IST