లారీ ఢీకొని బాలిక మృతి

ABN , First Publish Date - 2022-12-16T00:53:16+05:30 IST

పట్టణంలోని వై.జంక్షన్‌ వద్ద గురువారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయపడ్డారు.

లారీ ఢీకొని బాలిక మృతి
ప్రమాదంలో మృతిచెందిన బాలిక

ద్విచక్ర వాహనంపై స్నేహితులతో కలిసి వెళుతుండగా ఘటన

పాయకరావుపేట, డిసెంబరు 15: పట్టణంలోని వై.జంక్షన్‌ వద్ద గురువారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయపడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలు..

పాయకరావుపేటలోని పోసిన వారి వీధికి చెందిన మాధవి(15)తో పాటు మరో ఇద్దరు బాలికలు, ఒక బాలుడు స్నేహితులు. పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న చక్కా నగర్‌ కాలనీలో నివాసం వుంటున్న వీరి మిత్రుడిది శుక్రవారం పుట్టిన రోజు. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేసి, జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని భావించారు. నలుగురూ కలిసి రాత్రి పది గంటలు దాటిన తరువాత ద్విచక్రవాహనంపై చక్కా నగర్‌ కాలనీకి బయలుదేరారు. వై.జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి తుని నుంచి విశాఖపట్నం వెళుతున్న లారీ బలంగా ఢీకొంది. దీంతో వాహనం వెనుక కూర్చొన్న మాధవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. వాహనాన్ని నడుపుతున్న బాలుడితోపాటు మిగిలిన ఇద్దరు బాలికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Updated Date - 2022-12-16T00:53:19+05:30 IST