సౌర కాంతుల ఏలుబడి

ABN , First Publish Date - 2022-10-04T05:57:46+05:30 IST

ఎనిమిదేళ్ల క్రితం ఈ పాఠశాల భవనంపై ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్‌ వల్ల ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా విద్యుత్‌ కాంతులతో ఈ పాఠశాల వెలిగిపోతోంది.

సౌర కాంతుల ఏలుబడి
హైస్కూల్‌ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్‌

ఎనిమిదేళ్ల క్రితం కోటవురట్ల హైస్కూల్‌ భవనంపై 

సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు

రోజుకు 16 నుంచి 20 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి

పాఠశాలకు 6 నుంచి 10 యూనిట్ల వినియోగం

విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సిన పనే లేదు

నిరంతరాయంగా విద్యుత్‌ కాంతుల 

చక్కని ప్రణాళిక.. ముందు చూపు ఉంటే భవిష్యత్తు తరాలకు ప్రయోజనాలు చేకూర్చ వచ్చని కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్‌ను చూస్తే ఇట్టే తెలుస్తుంది. ఎనిమిదేళ్ల క్రితం ఈ పాఠశాల భవనంపై ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్‌ వల్ల ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా విద్యుత్‌ కాంతులతో ఈ పాఠశాల వెలిగిపోతోంది.

కోటవురట్ల, అక్టోబరు 3: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్‌లో సుమారు 450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 15 తరగతి గదులు ఉన్నాయి. ప్రతి గదికి ఫ్యాన్‌, ట్యూబ్‌లైట్లు ఉన్నాయి. పాఠశాలకు రన్నింగ్‌ వాటర్‌ మోటార్‌ పాయింట్‌ ఉంది. ఆర్‌వో ప్లాంట్‌, కంప్యూటర్స్‌, ప్రింటర్స్‌ ఉన్నాయి. పాఠశాలలో విద్యుత్‌ వినియోగం బట్టి నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు విద్యుత్‌ బిల్లు వచ్చేది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నెడ్‌ క్యాప్‌ సహకారంతో రూ.3 లక్షల వ్యయంతో 2 కేవీ సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ను పాఠశాల భవనంపై ఏర్పాటు చేశారు. ఈ సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 16 నుంచి 20 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. పాఠశాలకు సుమారు 6 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్‌ను విని యోగించుకుంటున్నారు. హైస్కూల్‌లో నిరంతరం విద్యుత్‌ సరఫరా కొనసాగుతున్నా బిల్లు మాత్రం రావడం లేదు. ఇంకా మిగులు విద్యుతే ఉంటోంది. సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి కూడా విద్యుత్‌ బిల్లు భారం తగ్గింది. ఇటువంటి సోలార్‌ యూనిట్లను ఇతర పాఠశాలలకు కూడా ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. Read more