ఆర్‌ఈసీఎస్‌లో అక్రమాలు

ABN , First Publish Date - 2022-09-30T06:28:59+05:30 IST

కశింకోట గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)ను ఈపీడీసీఎల్‌ స్వాధీనం చేసుకున్నా ఆర్థిక అవకతవకలు ఆగడం లేదు.

ఆర్‌ఈసీఎస్‌లో అక్రమాలు

డొనేషన్‌ పేరుతో ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి రూ.1,000 కోత

ఆ నిధుల నుంచే అడ్డగోలుగా నియమితులైన వారికి అనధికారికంగా జీతాలు చెల్లింపు?

ఇంకా కొనసాగుతున్న ఉన్నతాధికారుల డ్రామాలు

ఈపీడీసీఎల్‌ పరిధిలో ఉన్నా ఆర్‌ఈసీఎస్‌ పేరుతో పే స్లిప్‌లు

అవి చెల్లవంటున్న ఈపీడీసీఎల్‌ అధికారులు

జీతాల్లో కోత విధించొద్దని ఒకరు లెటర్‌ ఇచ్చినా అందరికీ వర్తింపజేస్తామని వెల్లడి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కశింకోట గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)ను ఈపీడీసీఎల్‌ స్వాధీనం చేసుకున్నా ఆర్థిక అవకతవకలు ఆగడం లేదు. ఇంకా అక్కడ రాజకీయ పెత్తనమే కొనసాగుతోంది. గత కొంతకాలంగా ఉద్యోగుల జీతం నుంచి విరాళం (డొనేషన్‌) పేరుతో వేయి రూపాయల చొప్పున కోత పెడుతున్నారు. ఆ డబ్బులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. ఉద్యోగులకు పే స్లిప్‌లు కూడా ఇవ్వడం లేదు. జీతం ఎందుకు తక్కువగా వస్తున్నదని ఆరా తీస్తే...వేయి రూపాయలు కోత బయటపడింది. ఈ సొమ్ము అంతా ఒక దగ్గర చేర్చి...దానిని అడ్డగోలుగా నియమితులైన ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నట్టు తేలింది.

ఏడాది క్రితం (సెప్టెంబరు, 2021) ఈపీడీసీఎల్‌కు ఆర్‌ఈసీఎస్‌ను అప్పగించినప్పుడు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో వారిని మాత్రమే కొనసాగించాలని, కొత్తవారికి నియమించుకోకూడదని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ రాజకీయ అండదండలతో అక్కడ ఇద్దరు ఉన్నతాధికారులు కలిసి కొత్తగా 33 మందిని అడ్డగోలుగా నియమించారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.22 వేలు చొప్పున జీతాలు ఇస్తూ వచ్చారు. ఆర్‌ఈసీఎస్‌ను మళ్లీ వెనక్కి ఇస్తారంటూ ఈ ఏడాది జూన్‌లో బిల్లుల వసూళ్లను కూడా చేతిలోకి ఇస్తున్నారు. దీనిని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ఈఆర్‌సీ తీవ్రంగా పరిగణించి, ఎండీ, పీఈలతో పాటు ఈపీడీసీఎల్‌ను కూడా పార్టీగా చేర్చి సుమోటోగా కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఈసీఎస్‌ మళ్లీ ఈపీడీసీఎల్‌ చేతుల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి...ఈపీడీసీఎల్‌ తొలుత స్వాధీనం చేసుకున్నప్పుడు ఎంతమంది వున్నారో వారికే జీతాలు ఇవ్వాలని, అదనంగా ఏ ఒక్కరికీ ఇవ్వడానికి లేదని చెప్పారు. దాంతో అడ్డగోలుగా నియమితులైన 33 మందికి జీతాలు ఆగిపోయాయి. వారంతా ఎవరైతే లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఉద్యోగాలు వేయించారో వారి వద్దకు వెళ్లి...తమ సంగతి ఏమిటని నిలదీశారు. నాయకులు, అధికారులు కూడబలుక్కొని కొంత కాలంపాటు వారికి అనధికారికంగా జీతాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆర్‌ఈసీఎస్‌లో 120 మంది ఉద్యోగుల (బిల్లు కలెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, లైన్‌మెన్‌, ఏఈలు) జీతం నుంచి నెలకు వేయి రూపాయలు డొనేషన్‌ పేరుతో వసూలు చేస్తున్న నిధులను ఉపయోగించుకోవాలనుకున్నారు. ఇలా ఒక్కో అనధికార ఉద్యోగికి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తున్నట్టు తెలిసింది.


చాలాకాలంగా వసూళ్లు

ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగులకు సంక్షేమ సంఘం అని ఒకటి ఉంది. అందులో జేఏఓ ఒకరు యాక్టివ్‌గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడో ఆ సంఘం పేరుతో ఒక లేఖ ఇవ్వడం వల్ల ఉద్యోగుల జీతాల నుంచి నెలకు వేయి రూపాయలు కోత పెడుతున్నారు. ఈ నిధులు ఏమవుతున్నాయో, ఏ సంక్షేమానికి ఉపయోగిస్తున్నారో ఆ నలుగురికీ తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇలా ఎంత వసూలు చేశారనేది విచారిస్తే గానీ బయటకు రాదు. దీనిపై కూడా ఈఆర్‌సీ దృష్టి పెట్టాల్సి ఉంది.


పే స్లిప్‌లు ఇవ్వడం లేదు

ప్రతి సంస్థ ఉద్యోగులకు ప్రతి నెలా ఎంత జీతం ఇస్తున్నదీ పే స్లిప్‌ ఇవ్వాలి. దేనికి ఎంత కోత విధిస్తున్నారో అందులో తెలియజేయాలి. ఆర్‌ఈసీఎస్‌ అధికారులు చాలా కాలంగా ప్లే స్పిప్పులు ఇవ్వడం లేదు. జీతం వచ్చేస్తోంది కదా? అని ఎవరూ పట్టించుకోలేదు. అడ్డగోలుగా నియమించిన వారికి తమ జీతాల నుంచే డబ్బులు ఇస్తున్నారని తెలిసి కొంతమంది సీనియర్‌ ఉద్యోగులు కశింకోట ఆర్‌ఈసీఎస్‌ కార్యాలయానికి వెళ్లి గురువారం పే స్లిప్పులు కావాలని డిమాండ్‌ చేశారు. దాంతో వారు జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన పే స్లిప్పులు ఇచ్చారు. అందులో డొనేషన్‌ పేరుతో వేయి రూపాయలు కోత వేసినట్టుగా ఉంది. ఆ డొనేషన్‌ ఎవరి కోసం అని అడిగితే....‘మీరు వద్దంటే ఆపేస్తాం’ అంటూ అక్కడి పరిపాలన అధికారి సమాధానం ఇచ్చారు. తాము లెటర్‌ ఇవ్వకుండా ఎలా కట్‌ చేస్తున్నారని అడిగితే....‘యూనియన్‌ నుంచి లెటర్‌ వచ్చింది’ అంటూ ఆమె సమాధానమిచ్చారు.


ఒక్కరు ఫిర్యాదు చేసినా మొత్తం ఆపేస్తాం

రాజశేఖర్‌, ఈఈ, ఈపీడీసీఎల్‌

గత ఆగస్టు నుంచి పూర్తిగా ఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలోనే ఆర్‌ఈసీఎస్‌ నడుస్తోంది. ఆర్‌ఈసీఎస్‌లో ఇచ్చే పే స్లిప్పులు చెల్లవు. అనధికారికంగా ఇస్తున్నట్టు తెలిసింది. యూనియన్‌ ఫండ్‌ పేరుతో డబ్బులు ప్రతి నెలా తీసుకుంటున్న మాట వాస్తవం. ఒక్క ఉద్యోగి అయినా ఆ మొత్తం కోత పెట్టవద్దని లెటర్‌ ఇస్తే...మొత్తం అందరికీ ఆపేస్తాం. అది ఈ నెల నుంచే అమలు చేస్తాం.

Read more