ఆర్‌ఈసీఎస్‌ వెనక్కి..!?

ABN , First Publish Date - 2022-12-02T01:22:17+05:30 IST

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘాన్ని మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం ఈపీడీసీఎల్‌ పరిధిలో ఇది నడుస్తోంది.

ఆర్‌ఈసీఎస్‌ వెనక్కి..!?

ఈపీడీసీఎల్‌ పర్యవేక్షణలో నుంచి తప్పించేందుకు వైసీపీ పెద్దల యత్నాలు

ఈ నెల 14న ప్రజాభిప్రాయ సేకరణ

సంస్థ నడుస్తున్నది ఇక్కడ...

అభిప్రాయ సేకరణ హైదరాబాద్‌లో!

పెద్దఎత్తున నిధులు దుర్వినియోగం జరుగుతున్నట్టు ఎప్పటినుంచో ఆరోపణలు

అర్హత లేకుండా పదుల సంఖ్యలో ఉద్యోగాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘాన్ని మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం ఈపీడీసీఎల్‌ పరిధిలో ఇది నడుస్తోంది. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆదేశం మేరకు గత ఏడాది సెప్టెంబరులో ఆర్‌ఈసీఎస్‌ను ఈపీడీసీఎల్‌ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి విద్యుత్‌ సరఫరా, నిర్వహణ, బిల్లుల వసూళ్లు వంటి వ్యవహారాలు ఈపీడీసీఎల్‌ చూస్తోంది. అయితే ఆ జిల్లా మంత్రి ఒకరు ఆ సంస్థను ఎలాగైనా మళ్లీ వెనక్కి తేవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్టుంది. ఈ మేరకు ఈఆర్‌సీకి ఈ ఏడాది మే నెలలో లేఖ రాసింది. దానిపై అక్కడ నిర్ణయం తీసుకోకముందే...ఇక్కడ కశింకోటలో మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రాజెక్టు ఇంజనీర్‌లు అత్యుత్సాహంతో ఈపీడీసీఎల్‌ను పక్కనపెట్టి సొంతంగా సొసైటీ తరపున మళ్లీ బిల్లుల వసూళ్లు ప్రారంభించారు. దీనిని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ఈఆర్‌సీ చైర్మన్‌ స్పందించి, సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఈ ప్రక్రియ జరుగుతుండగానే జూలై నెల బిల్లులు కూడా వసూలు చేసుకున్నారు. దాంతో ఈఆర్‌సీ చైర్మన్‌ తీవ్రంగా స్పందించి, ఆర్‌ఈసీఎస్‌ ఎండీని, ఈపీడీసీఎల్‌ ఎండీలను హైదరాబాద్‌ పిలిపించింది. ప్రభుత్వం చేసిన సిఫారసు ఇంకా పరిశీలనలో ఉండగా, సంస్థను ఎలా చేతుల్లోకి తీసుకుంటారంటూ ఆర్‌ఈసీఎస్‌ ఎండీని గట్టిగా మందలించి, రెండు నెలల బిల్లులు ఈపీడీసీఎల్‌కి వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఈపీడీసీఎల్‌ అధికారులే అక్కడ అన్నీ చూడాలని స్పష్టంచేశారు. దాంతో ఆర్‌ఈసీఎస్‌ను వెనక్కి ఇచ్చే ప్రక్రియ అప్పటికి తాత్కాలికంగా వాయిదా పడింది. దీనిపై పట్టు వదలని మంత్రి పదేపదే ఒత్తిడి తేవడంతో ఇప్పుడు ఆ అంశంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని, ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఈఆర్‌సీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 14న హైదరాబాద్‌లో దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని, ప్రజలు, వినియోగదారులు, సంస్థలు, సంఘాలు హాజరై వారి అభిప్రాయాలు చెప్పాలని కోరింది. అయితే ఇదంతా ప్రొసీజర్‌ మాత్రమేనని, ఆర్‌ఈసీఎస్‌ను మళ్లీ వెనక్కి ఇచ్చేస్తారని గట్టి వాదన వినపడుతోంది.

అర్హత లేకుండా ఉద్యోగాలు

అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌లో పెద్దఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అవసరం లేకపోయినా రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని అందులో అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, దాంతో ఆర్థిక భారం పెరిగిపోతున్నదంటూ ఈఆర్‌సీకి అనేక ఫిర్యాదులు గతంలోనే వెళ్లాయి. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, వైసీపీ పార్టీ సీనియర్‌ నాయకులు దాడి వీరభద్రరావు తదితరులు దీనిపై ఈఆర్‌సీ చైర్మన్‌కు సుదీర్ఘమైన లేఖను, ఆధారాలతో సహా పంపించారు. తాజాగా అంటే ఏడాది క్రితం కూడా ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున తీసుకొని, 33 మందిని ఆర్‌ఈసీఎస్‌లో ఉద్యోగులుగా నియమించారు. వారికి జీతాలు కూడా చెల్లించారు. ఇప్పుడు ఈపీడీసీఎల్‌ వారిని నిలిపివేసింది. నియామక పత్రాలు లేవని, వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఇలా ఏటా సరైన అర్హతలు లేకుండా డబ్బులు తీసుకొని నియమిస్తున్నారు. దీనివల్ల సంస్థకు నష్టాలు వచ్చే ప్రమాదం ఏర్పడింది.

ఈపీడీసీఎల్‌కు నెలకు రూ.5 కోట్ల నష్టం

ఆర్‌ఈసీఎస్‌ సహకార సంస్థ కావడంతో వారికి ఈపీడీసీఎల్‌ రాయితీ ధరపై విద్యుత్‌ను అందించేది. యూనిట్‌ విద్యుత్‌ను కేవలం రూ.1.50 ఇస్తే...దానిని వారు వినియోగదారులకు అందించి, వారి నుంచి ఈపీడీసీఎల్‌ తరహాలోనే యూనిట్‌కు రూ.4 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. ఈపీడీసీఎల్‌ నెలకు మూడు కోట్ల రూపాయల విలువైన విద్యుత్‌ అందిస్తే...దానిని ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయలకు అమ్ముకుంటోంది. ఈపీడీసీఎల్‌కు రూ.మూడు కోట్ల బిల్లు, జీతాలకు రూ.2 కోట్లు, నిర్వహణకు కోటి రూపాయలు వెచ్చిస్తే...ఇంకా మూడు కోట్ల వరకు లాభం మిగులుతోంది. దీనిని సంస్థను నడిపించే పెద్దలు రకరకాల పేర్లతో స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ సంస్థ లెక్కలను ఆడిట్‌ చేసే ఒక అధికారి దాదాపు రూ.5 కోట్లతో ఆధునిక భవంతిని నిర్మించుకోగలిగారు. అలాగే చాలాకాలం ఆ సొసైటీకి అధ్యక్షునిగా పనిచేసిన నాయకుడే ఇప్పుడు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ఆయనకు మంత్రి వెన్నుదన్నుగా ఉన్నారు.

రైతులకు ఒక న్యాయం...సొసైటీలకు మరో న్యాయమా?

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను కచ్చితంగా లెక్క కట్టి, దుబారా నివారిస్తామని చెప్పి పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్న విద్యుత్‌ శాఖ అధికారులు...కాలం చెల్లిన సొసైటీలకు అతి తక్కువ ధరకు విద్యుత్‌ను ఇచ్చి, వారికి లాభాలు పంచి, ఇతర వినియోగదారులపై ఆ భారం మోపడం ఏ విధంగా న్యాయమో ఈఆర్‌సీ పెద్దలు ఆలోచించాల్సి ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా మళ్లీ సొసైటీని తెచ్చి ఈపీడీసీఎల్‌లో విలీనం చేయాల్సిందే. అంతవరకు అధికార పార్టీ నేతలు దోచుకోవడానికి వీలుగా ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని సిఫారసు చేయడం విమర్శలకు తావిస్తోంది.

ప్రజలు ఇక్కడ.. .అభిప్రాయం అక్కడా..?

ఆర్‌సీఈఎస్‌ వినియోగదారులు అనకాపల్లి జిల్లాలో ఉంటే...దానిపై అభిప్రాయం కోసం ఇక్కడ సభ నిర్వహించాల్సి ఉండగా, ఈఆర్‌సీ...పొరుగు రాష్ట్రంలో సభ నిర్వహిస్తోంది. ఎంతమంది అంత దూరం వెళ్లి వారి అభిప్రాయాలు చెబుతారు?. విద్యుత్‌ చార్జీల మీద ఆయా ప్రాంతాలకు వెళ్లి అభిప్రాయాలు తీసుకునే ఈఆర్‌సీ దీనిపై కశింకోట వచ్చి, ఎందుకు ప్రజాభిప్రాయం తీసుకోకూడదని ఇక్కడి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతదూరం ఎవరూ వెళ్లరు కాబట్టి, ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు...అందుకే వెనక్కి ఇస్తున్నామని చెప్పి ‘మమ’ అనిపించడానికే ఈ తంతు నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-12-02T01:22:18+05:30 IST