మూడు రాజధానులపై రెఫరెండానికి రెడీ

ABN , First Publish Date - 2022-09-19T07:08:31+05:30 IST

రాష్ట్రంలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం రెఫరెండానికి వెళ్లాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాల్‌ చేశారు.

మూడు రాజధానులపై రెఫరెండానికి రెడీ
మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు. చిత్రంలో పల్లా శ్రీనివాసరావు, దువ్వారపు రామారావు, పీలా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, ప్రసాద్‌

మంత్రి అమర్‌కు టీడీపీ నేత అయ్యన్న సవాల్‌

రైతుల పాదయాత్రను దెయ్యాల యాత్రగా అభివర్ణించడం తగదు

హుందాగా మాట్లాడాలని మంత్రికి హితవు


విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం రెఫరెండానికి వెళ్లాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాల్‌ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా 35 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు తమకు జరిగిన అన్యాయంపై అమరావతి నుంచి అరసవల్లి వరకు చేస్తున్న పాదయాత్రను మంత్రి అమర్‌ దెయ్యాల పాదయాత్రగా అభివర్ణించడం శోచనీయమని, బాధ్యత కలిగిన పదవిలో వున్న వ్యక్తి హుందాగా మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తున్న రైతులకు హైకోర్టులో న్యాయం జరిగిందని, సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. రుషికొండలో సీఎం కోసం నిర్మిస్తున్న భవనం (ఏపీటీడీసీ రిసార్టులను కూల్చివేసిన ప్రదేశంలో..) ముందు వివరాలతో కూడిన బోర్డు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సతీమణి భారతి ఫోన్‌ చేస్తే, స్పందించలేదన్న కోపంతో  జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశను బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. అధికారులకు సీఎం భార్య ఫోన్‌ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పెద్దలు ఉత్తరాంధ్రలో భూములు దోచుకుంటే ఆ పార్టీకి చెందిన ఇక్కడ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖలో వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు కోసం కేటాయించిన భూములను జగన్మోహనరెడ్డి దోచుకున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-19T07:08:31+05:30 IST