రామన్నపాలెంలో భూకబ్జా

ABN , First Publish Date - 2022-03-05T06:13:18+05:30 IST

మండలంలో రామన్నపాలెం పంచాయతీ పరిధి లోని ఊటగెడ్డ రిజర్వాయర్‌ ఎగువ ప్రాం తం కబ్జాకు గురవుతున్నది.

రామన్నపాలెంలో భూకబ్జా

ఊటగెడ్డ రిజర్వాయర్‌ వెనుక ప్రాంతం ఆక్రమణ

ఎనిమిది ఎకరాల మేర యంత్రాలతో చదును చేసిన అక్రమార్కులు

జలాశయంలోకి వర్షపునీరు వచ్చే కొండగెడ్డలు పూడ్చివేత

ప్రశ్నార్థకంగా ఆయకట్టుకు సాగునీరు


మాకవరపాలెం, మార్చి 4: మండలంలో రామన్నపాలెం పంచాయతీ పరిధి లోని ఊటగెడ్డ రిజర్వాయర్‌ ఎగువ ప్రాం తం కబ్జాకు గురవుతున్నది. అక్రమార్కులు యంత్రాల సాయంతో ఎత్తుపల్లాలను సరి చేస్తూ, జలాశయంలోకి వర్షపు నీరు వచ్చే కొండవాగులను మట్టితో కప్పేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో రిజర్వాయర్‌లోకి నీరు వచ్చే పరిస్థితి వుండదని, ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు 737లో రామన్నపాలెం పంచాయతీ శివారు చినరాచపల్లి గ్రామానికి ఆనుకొని సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఊటగెడ్డ రిజర్వాయర్‌ ఉంది. ఎగువన వున్న నాలుగు కొండగెడ్డల నుంచి వచ్చే వర్షపునీరు ఆధారంగా ఈ జలాశయాన్ని నిర్మించారు. దీని ద్వారా రామన్నపాలెం, చినరాచపల్లి, వెంకయ్యపాలెం గ్రామాలకు చెందిన 300 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. కాగా ఈ ప్రాంతమంతా ప్రభుత్వ భూమి కావడంతో అక్రమార్కుల కన్ను పడింది. సుమారు వారం రోజుల నుంచి రిజర్వాయర్‌ ఎగువ ప్రదేశాన్ని యంత్రాలతో చదును చేస్తున్నారు. ఎత్తు పల్లాలను సరిచేస్తూ కొండగెడ్డలను మట్టితో కప్పేస్తున్నారు. కబ్జాదారులు చదును చేసిన ప్రదేశం సుమారు ఎనిమిది ఎకరాల వరకు వుంటుందని, కొండగెడ్డలను పూడ్చేయడంతో రిజర్వాయర్‌లోకి వర్షపు నీరు వచ్చే పరిస్థితి వుండదని రైతులు చెబుతున్నారు. సుమారు నాలుగేళ్ల క్రితం కబ్జాదారులు సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమిని (ప్రస్తుతం చదును చేసిన ప్రదేశానికి పక్కనే) ఆక్రమించి చదును చేయగా, అప్పటి తహసీల్దార్‌ రమామణి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించి, అక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. కాగా ఊటగెడ్డ రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతం ఆక్రమణకు గురైన విషయాన్ని తహసీల్దార్‌ రాణి అమ్మాజీ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, సర్వే చేయించి, అక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-03-05T06:13:18+05:30 IST