చింతపల్లి, జీకేవీధిల్లో వర్షం

ABN , First Publish Date - 2022-04-24T06:49:06+05:30 IST

చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో భారీ వర్షం కురిసింది.

చింతపల్లి, జీకేవీధిల్లో వర్షం

 గూడెంకొత్తవీధి/చింతపల్లి, ఏప్రిల్‌ 23:

చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కాగా ఈ వర్షాలు వేసవి దుక్కులు, కాఫీ పూతకు అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

పిడుగుపాటుకు యువకుడి మృతి

అరకులోయ, ఏప్రిల్‌ 23: మండలంలోని మాడగడ పంచాయతీ మెచ్చగుడలో శనివారం మధ్యాహ్నం పిడుగు పడి పెట్టెలి రవికుమార్‌ (20) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో సమీపంలోని మర్రిచెట్టు కిందకు వెళ్లగా.. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో రవికుమార్‌ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కళ్లెదుట రవికుమార్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వర్షం, పిడుగులు పడే సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్ల వద్దని తహసీల్దార్‌ వేణుగోపాల్‌ కోరారు. యువకుడు మృతిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానన్నారు. మాడగడ ఎంపీటీసీ సభ్యులు సొనాయి లక్ష్మి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

Read more