రైల్వేలో ఇంటి దొంగలు!!

ABN , First Publish Date - 2022-09-25T06:53:39+05:30 IST

వాల్తేరు డివిజన్‌లో దశాబ్దాలుగా పాతుకుపోయి రైల్వే ఆస్తులను కొల్లగొడుతున్న ఇంటి దొంగలకు ఎట్టకేలకు ఉన్నతాధికారులు చెక్‌ పెట్టారు.

రైల్వేలో ఇంటి దొంగలు!!
సింహాచలం నార్త్‌లో ఆక్రమణల తొలగింపు

స్థానిక రౌడీలతో కలిసి ఆగడాలు

రైల్వే భూముల ఆక్రమణ...నిర్మాణాలు

దశాబ్దాలుగా అవే సీట్లలో పాగా

అదేమని ప్రశ్నించిన ఉన్నతాధికారులపై తప్పుడు ఫిర్యాదులు.. ఆందోళనలు

ప్రక్షాళనకు నడుం కట్టిన డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌

274 ఆక్రమణల తొలగింపు

12 మంది సస్పెన్షన్‌...మరో 12 మంది క్రమశిక్షణ చర్యలు


విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):


వాల్తేరు డివిజన్‌లో దశాబ్దాలుగా పాతుకుపోయి రైల్వే ఆస్తులను కొల్లగొడుతున్న ఇంటి దొంగలకు ఎట్టకేలకు ఉన్నతాధికారులు చెక్‌ పెట్టారు. ప్రశ్నించే అధికారులను బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తూ, తప్పుడు ఫిర్యాదులు పంపుతున్న వారిని గుర్తించి పక్కనపెట్టారు. ఒక్క విశాఖ జిల్లాలోనే రెండు వేల ఎకరాలకు పైగా వున్న రైల్వే భూముల్లో 274 ఆక్రమణలను గుర్తించి తొలగించారు. కేటాయించిన రైల్వే క్వార్టర్లను అద్దెకు ఇచ్చుకొని పబ్బం గడుపుతున్న వారిని బయటకు పంపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బయట యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వారిపైనా చర్యలు చేపట్టారు. తప్పుడు పనులు చేసిన 12 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేయగా, మరో 12 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విశాఖ రైల్వే డివిజన్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పథి శనివారం విలేకరులతో మాట్లాడారు. డివిజన్‌లో అడ్డగోలు వ్యవహారాలను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. అప్పగించిన విధులు నిర్వర్తించకుండా, ఇతర వ్యవహారాల్లో తలదూరుస్తూ తప్పుడు పనులు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోను క్షమించేది లేదని హెచ్చరించారు.


స్థానిక రౌడీలతో కలిసి దందాలు

వాల్తేరు రైల్వే డివిజన్‌కు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోను వేల ఎకరాల భూములు, ఆస్తులు ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారే స్థానిక నాయకులు, రౌడీలతో కలిసిపోయి రైల్వే భూములను ఆక్రమించి లీజుకు ఇస్తూ, నిర్మాణాలు చేపడుతున్నారు. కొంతమంది ఉద్యోగులైతే వారికి కేటాయించిన రైల్వే క్వార్టర్లను కూడా ఇతరులకు లీజుకు ఇచ్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నారు. ఇలాంటి వాటిని గుర్తించి ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే...వారిపై తప్పుడు ఫిర్యాదులు, కేసులు పెట్టడం, ఆందోళనలు చేయించడం, ఉన్నతాధికారులకు లేఖలు రాయడం వంటి పనులు చేస్తున్నారు. వీటన్నింటిపైనా డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ దృష్టి పెట్టారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ చేయించారు. అందులో వాస్తవం ఎంతో గమనించారు. అందులో అనేకం తప్పుడు ఫిర్యాదులని తేలడంతో...దానికి కారణం ఎవరో గుర్తించి, వారి తప్పులను బయటకు తీశారు. 

- గూడ్స్‌ విభాగంలో ఒక క్లర్క్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌గా 21 ఏళ్లుగా ఒకే సీట్లో వుంటూ బాగా ఆదాయం సంపాదిస్తున్నాడు. ఉన్నతాధికారులను బ్లాక్‌మెయిలింగ్‌ కూడా చేయడం ప్రారంభించాడు. దాంతో ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించి వేరే పోస్టులోకి పంపించారు. దాంతో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన ఆ ఉద్యోగి మళ్లీ తన పోస్టు కోసం డివిజనల్‌ అధికారులపై రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చాడు. అయినా సరే అతడిని మళ్లీ ఆ పోస్టులోకి తీసుకోలేదు. 

- స్టోర్ట్స్‌ విభాగంలో పనిచేసే మరో ఉద్యోగి కొన్నేళ్లుగా అక్కడే పనిచేస్తూ ఇతర మార్గాల్లో లబ్ధిపొందుతున్నాడు. ఆయనకు స్పోర్ట్స్‌లో ఎటువంటి ప్రవేశం, అనుభవం లేకుండానే ఆ విభాగంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి జేబులో వేసుకున్నాడు. అతడు గతంలో రెండుసార్లు అరెస్టు కూడా అయ్యాడు. ఆరోపణలన్నీ నిజమని తేలడంతో తనపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. 

- ఒక ఉద్యోగికి డాల్ఫిన్స్‌ నోస్‌ రైల్వే కాలనీలో ఆర్‌ఈ/13 నంబరు కలిగిన క్వార్టర్‌ను కేటాయించారు. సదరు ఉద్యోగి అందులో కుటుంబంతో వుండకుండా ఆరు లక్షల రూపాయలకు దానిని ఒకరికి ఇచ్చేశాడు. కొద్దికాలానికి సదరు ఉద్యోగి అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో ఆ క్వార్టర్‌ను వేరేవారికి కేటాయించాలనుకున్నారు. అయితే అందులో ప్రైవేటు వ్యక్తులు వున్న విషయం తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోయారు. వెళ్లి ప్రశ్నిస్తే...తాము దానిని కొనుక్కున్నామని, ఖాళీ చేయబోమని దబాయించారు. చట్టప్రకారం చర్యలు చేపట్టి వారిని ఖాళీ చేయించారు. 

- ఇలా చాలా క్వార్టర్లు అనధికార వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని గుర్తించి, వాటికి తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అలాగే మరికొందరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైల్వే భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. వారిని కూడా ఖాళీ చేయించారు. సింహాచలం రైల్వే స్టేషన్‌ నుంచి సింహాచలం నార్త్‌ పాయింట్‌ వరకు గల రైల్వే భూముల్లో ఒక్క శుక్రవారం (ఈ నెల 23వ తేదీ)నాడే ఇరవైకి ఆక్రమణలు తొలగించారు. ఇక్కడ పలువురు రైల్వే భూముల్లో దుకాణాలు నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. వీరికి ఆర్‌పీఎఫ్‌ సహకారం ఉంది. వీటన్నింటినీ గుర్తించిన అధికారులు ప్రత్యేక సిబ్బందితో వెళ్లి వాటిని తొలగించారు.

- డివిజన్‌ కార్యాలయంలో కీలక విభాగంలో పనిచేసే ఒక ఉన్నతాధికారి నిత్యం తప్పుడు ఫిర్యాదులు పెడుతూ, యూనియన్లతో ఆందోళనలు చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా పలువురికి అడ్డంకులు కల్పిస్తున్నారు. ఆధారాలతో సహా ఆయన్ను పట్టుకొని ఆ స్థానం తప్పించారు.


పనిచేసే వారికి పూర్తి సహకారం

అనూప్‌కుమార్‌ శెత్పథి, డీఆర్‌ఎం

రైల్వేలో నిబంధనల ప్రకారం చిత్తశుద్ధితో పనిచేసే వారికి అండగా ఉంటాము. తప్పుడు పనులు చేసేవారికి శిక్ష తప్పదు. కేంద్ర విజిలెన్స్‌ కమిటీ నిబంధనల మేరకు అన్ని ఫిర్యాదులు పరిశీలిస్తాం. వాస్తవాలు వుంటేనే పరిగణనలోకి తీసుకుంటాము. తప్పడు ఫిర్యాదులకు స్పందించేది లేదు. ఇప్పుడు ఎవరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామో...వారంతా గ్రూపు కట్టి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ విషయమూ మా దృష్టిలో ఉంది. ఈ ప్రక్షాళనకు తూర్పు కోస్తా జోన్‌ అధికారులు సహకరించారు. దాంతోనే ముందుకు వెళ్లగలిగాము. Read more