ప్రొటోకాల్‌ వివాదం.. ఇద్దరిపై వేటు?

ABN , First Publish Date - 2022-05-21T06:51:42+05:30 IST

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సమయంలో తలెత్తిన ప్రొటోకాల్‌ వివాదంలో ఇద్దరు ఉన్నతాధికారులపై రహస్యంగా వేటు వేశారు.

ప్రొటోకాల్‌ వివాదం.. ఇద్దరిపై వేటు?

దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌

శ్రీనివాసరెడ్డి ఇప్పటికే బదిలీ

త్వరలో సింహాచలం దేవస్థానం ఈఓ సూర్యకళకు స్థాన చలనం

వివాదం వల్ల కాకుండా  సాధారణ బదిలీల్లా జరగాలని, అదే విషయం మీడియాలో కూడా రావాలని అంతర్గతంగా ఆదేశాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సమయంలో తలెత్తిన ప్రొటోకాల్‌ వివాదంలో ఇద్దరు ఉన్నతాధికారులపై రహస్యంగా వేటు వేశారు. అందులో ఒకరు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డి కాగా మరొకరు ఆలయ ఈఓ సూర్యకళ. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఈ నెల మూడో తేదీన జరిగిన చందనోత్సవానికి రాగా రాజగోపురం వద్ద తగిన గౌరవం లభించలేదు. ఈ విషయమై ఆయన నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానిపై సీఎంఓ పేషీ నుంచి కలెక్టర్‌ మల్లికార్జునను వివరణ కోరారు. దాంతో ఆయన ఆ వివాదంపై విచారణ చేశారు. వివరాలు సేకరించారు. ఎవరికి ప్రొటోకాల్‌ డ్యూటీ వేశారో తెలుసుకున్నారు. ఆ విధులను సక్రమంగా నిర్వహించారో లేదో పరిశీలించారు. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు తొలి దర్శనం పూర్తయిన వెంటనే తమకు దర్శనం కల్పించాలని ఈఓ సూర్యకళపై రాత్రి మూడు గంటల సమయంలో ట్రస్టు బోర్డు సభ్యులు ఒత్తిడి తేవడంతో ఆమె తలొగ్గి వారిని విడిచిపెట్టాలని రాజగోపురం వద్ద విధుల్లో వున్న పోలీసు అధికారులను ఆదేశించారు. తానే స్వయంగా కుడివైపున ఉన్న గేటును తీయించడంతో ట్రస్టుబోర్టు సభ్యులతో పాటు ఇతర భక్తులు కూడా పదుల సంఖ్యలో తోసుకొని రాజగోపురం ద్వారా లోపలకు వెళ్లిపోయారు. ఆ సమయంలోనే ప్రొటోకాల్‌ డ్యూటీలు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు పలువురు కేటాయించిన స్థానాల్లో కాకుండా లోపల అంతరాలయంలోకి వెళ్లిపోయి అక్కడ తమ వారికి దర్శనాలు చేయించడంలో బిజీ అయిపోయారు. ఈ విషయంలో కలెక్టర్‌ అప్పుడే డీసీ శ్రీనివాసరెడ్డికి, ఈఓ సూర్యకళకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.


ఇచ్చిన సమయం కంటే ముందుగానే..

వీవీఐపీలు అందరికీ దర్శనానికి ఏ సమయంలో రావాలో వారికి ఇచ్చిన టిక్కెట్లపై ముద్రించారు. అయితే చాలామంది కేటాయించిన సమయం కంటే ముందుగానే రాజగోపురం వద్దకు చేరుకున్నారు. అక్కడ అదే సమయంలో వివాదం రేగడంతో చాలామందికి అధికారిక స్వాగత సత్కారాలు లభించలేదు. ఈ విషయాలన్నీ కలెక్టర్‌ నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించారు. ఎవరెవరు బాధ్యులో కూడా అందులో వివరించారు. అయితే అమరావతిలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ జాబితా నుంచి కొంతమందిని తప్పించారు. ఎప్పటిలాగే ఓ దేవదాయ శాఖ అధికారిని కూడా బయట పడేశారంటున్నారు. కేవలం ఇద్దరిపైనే చర్యలకు ఆదేశించారు. అది కూడా చందనోత్సవం వివాదం వల్ల వారిపై చర్యలు చేపట్టినట్టు కాకుండా సాధారణ బదిలీల్లా జరగాలని, అదే విషయం మీడియాలో కూడా రావాలని అంతర్గతంగా ఆదేశించారు. ఆ మేరకు ఈ నెల 11వ తేదీన దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డిని పూర్వపు స్థానం నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయానికి ఈఓగా బదిలీ చేశారు. ఆయన కూడా తన బదిలీకి కారణం ఏమిటో చెప్పకుండానే ఉత్తర్వులు వచ్చిన సాయంత్రమే కొత్త డీసీ సుజాతకు బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ అయి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేవిధంగా సింహాచలం ఈఓ సూర్యకళను కూడా ఈ వివాదం కారణంగా బదిలీ చేస్తున్నట్టు చెప్పలేదు. దేవదాయ శాఖలో ప్రధాన ఆలయాలకు ఈఓలుగా పనిచేసే రెవెన్యూ అధికారులు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ అయి ఉండాలని, అంతకంటే తక్కువ స్థాయి అయితే వారిని తప్పించి దేవదాయ శాఖ అధికారులనే నియమించాలనే తాజా నిర్ణయం ప్రకారం  చర్యలు చేపడుతున్నామని, సిద్ధంగా ఉండాలని సూచించారు. దానికి ఆమె కూడా సిద్ధమైపోయారు. ఆమె స్థానంలో దేవదాయ శాఖకు చెందిన జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి నియామకం కోసం ఆ శాఖ ప్రయత్నం చేస్తోంది. రాజకీయ ఆమోదం లభించగానే ఉత్తర్వులు వస్తాయని సమాచారం. అంతవరకు ఈఓగా ఉండాలని సూర్యకళకు సూచించడంతో అన్యమనస్కంగానే ఆమె విధులకు హాజరవుతున్నారు. కీలక నిర్ణయాలు ఏమీ తీసుకోవడం లేదు. తాజాగా రెండు రోజుల క్రితం అమరావతిలో దేవదాయ శాఖ కమిషనర్‌ నిర్వహించిన ఈఓల సమావేశానికి కూడా ఆమె హాజరు కాలేదు. ఇది కూడా ఆ శాఖలో చర్చకు దారితీసింది. ఏదేమైనా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్ల మేరకు నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-05-21T06:51:42+05:30 IST