యర్రవరం హైడ్రో ప్రాజెక్టుపై నిరసన వెల్లువ

ABN , First Publish Date - 2022-12-15T00:11:52+05:30 IST

యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు (పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

యర్రవరం హైడ్రో ప్రాజెక్టుపై నిరసన వెల్లువ
కార్పొరేట్‌ మాఫియా దిష్టిబొమ్మను దహనం చేయడానికి సిద్ధమవుతున్న గిరిజన సంఘం నాయకులు, ఆదివాసీలు

ఆదివాసీల ర్యాలీ

కార్పొరేట్‌ మాఫియా దిష్టిబొమ్మ దహనం

బాక్సైట్‌ తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గిరిజన సంఘం నేతల హెచ్చరిక

చింతపల్లి, డిసెంబరు 14: యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు (పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీలతో కలిసి గిరిజన సంఘం నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ నాయకుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ అటవీ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాక్సైట్‌ తవ్వకాల అనుమతుల జీవో-97ను ఆదివాసీలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోలేక తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తాజాగా ఇదే తరహాలో గిరిజన ప్రాంత సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంత అటవీ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. యర్రవరం పవర్‌ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుప్రీం కోర్టు తీర్పు, 1/70 భూబదలాయింపు చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు. దొడ్డిదారిని యర్రవరం పీఎస్‌పీపై డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్రానికి పంపించడంతో డిసెంబరు 22న మోదీ ప్రభుత్వం పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు చేసిందన్నారు. గిరిజన గ్రామ సభ ఆమోదం, గిరిజన సలహామండలి(టీఏసీ) తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పవర్‌ ప్రాజెక్టుని కార్పొరేట్‌ కంపెనీకి అప్పగించడం అన్యాయమని తెలిపారు. పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదివాసీలు గ్రామాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వస్తుందన్నారు. కేవలం స్వప్రయోజనాల కోసం ఆదివాసీల జీవితాలను కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాలను విరమించుకోవాలన్నారు. లేదంటే బాక్సైట్‌ తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యమాలు ఉధృతం చేస్తామని, దీనికి అవసరమైన కార్యాచరణ గిరిజన సంఘం రూపొందిస్తుందన్నారు. అనంతరం కార్పొరేట్‌ మాఫియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్‌, మండల కార్యదర్శి సింహాచలం, ఉప సర్పంచ్‌ సోమరాజు, మాజీ ఉపాధ్యక్షుడు బెన్నాస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:12:40+05:30 IST