ప్రియుడుకి కాబోయే భార్యను అంతమొందించిన ప్రియురాలు

ABN , First Publish Date - 2022-10-08T06:19:30+05:30 IST

వారిద్దరూ ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ వారి పెళ్లికి యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

ప్రియుడుకి కాబోయే భార్యను అంతమొందించిన ప్రియురాలు
నిందితులులతో ఏఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌, పోలీసులు

హత్యకు సహకరించిన ప్రియుడు

ఇంటికి సమీపంలో గొయ్యి తీసి మృతదేహం పూడ్చివేత

యువతి కనిపించకపోవడంతో నిలదీసిన మృతురాలి కుటుంబ సభ్యులు

తమకు తెలియదని బుకాయింపు

మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు

ఏడాది క్రితం జి.మాడుగుల మండలం లువ్వసింగి పంచాయతీ చిట్టంపుటులో ఘటన 

అనంతరం ఆలమూరు వెళ్లిపోయిన ప్రేమజంట

చేపల చెరువులో పనిచేస్తూ సహజీవనం

అనుమానంతో గట్టిగా విచారించిన పోలీసులు

నేరం ఒప్పుకున్న నిందితులు

మృతదేహం వెలికితీత, పోస్టుమార్టమ్‌

ప్రేమజంట అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

వివరాలు వెల్లడించిన చింతపల్లి, ఏఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌


చింతపల్లి, అక్టోబరు 7: వారిద్దరూ ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ వారి పెళ్లికి యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు అతనిని నిలదీసింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతేకాక ఆ యువతిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పూడ్చిపెట్టి, ఏమీ ఎరగనట్టు నటించారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు. మరోవైపు ప్రేమికులిద్దరూ వేరే ప్రాంతానికి వెళ్లి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకే ఏడాది తరువాత నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం చింతపల్లి ఏఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌ మీడియాకు వెల్లడించారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం లువ్వసింగి పంచాయతీ చిట్టంపుట్టు గ్రామానికి చెందిన కోరాబు లక్ష్మి, చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ సంపంగిపుట్టు గ్రామానికి చెందిన వండలం గోపాల్‌ ఐదేళ్లగా ప్రేమించుకుంటున్నారు. లక్ష్మి ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి వద్దనే వుంటున్నది. గోపాల్‌ ఐదో తరగతి వరకు చదివి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం గోపాల్‌ తల్లిదండ్రులకు తెలియడంతో వారు మందలించి, గత ఏడాది ఆగస్టులో అదే గ్రామానికి చెందిన చెదల కాంతమ్మ(20)తో వివాహం చేసేందుకు నిర్ణయించారు. అనంతరం గోపాల్‌ కాబోయే భార్య కాంతమ్మతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి... గోపాల్‌ను కలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను ప్రేమించి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీసింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇద్దరం కలిసి జీవించాలంటే కాంతమ్మను అంతమొందించాలని చెప్పి ఆ మేరకు వ్యూహరచన చేసింది. గత ఏడాది సెప్టెంబరు 9వ తేదీ వినాయక చవితి రోజున గోపాల్‌, లక్ష్మి కలిసి కాంతమ్మ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత తనను ఇంటి వద్ద దిగబెట్టాలని లక్ష్మి కోరింది. దీంతో ముగ్గురూ కలిసి సంపంగిపుట్టు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న చిట్టంపుట్టు వెళ్లారు. వినాయక చవితి కావడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మండపంలో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లారు. లక్ష్మి, కాంతమ్మ ఇంటి లోపలకు వెళ్లగా, గోపాల్‌ బయట ఉన్నాడు. కాంతమ్మ కూర్చోని ఉండగా లక్ష్మి గొడ్డలి తీసుకుని తల వెనుక భాగంలో బలంగా కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయి గట్టిగా కేకలు వేసింది. గోపాల్‌ వెంటనే లోపలకు వచ్చి కాంతమ్మ నోరు, ముక్కు గట్టిగా నొక్కి పెట్టాడు. ఇదే సమయంలో లక్ష్మి మరోమారు కాంతమ్మ తలపై గొడ్డలితో బలంగా కొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఇద్దరూ కలిసి కాంతమ్మ మృతదేహాన్ని రగ్గులో చుట్టి, సుమారు 100 అడుగుల దూరంలో ఒక గోతిలో పూడ్చివేశారు. గోపాల్‌ తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. కాంతమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆచూకీ లభించకపోవడంతో మరుసటి రోజు లక్ష్మిని, గోపాల్‌ని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. కాంతమ్మ ఎక్కడకు వెళ్లిందో తమకు తెలియదని గోపాల్‌, లక్ష్మి చెప్పడంతో కాంతమ్మ తల్లి నారాయణమ్మ అన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదుచేశారు. మూడు నెలల అనంతరం గోపాల్‌, లక్ష్మి కలిసి తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) ఆలమూరుకు వలస వెళ్లి చేపల చెరువులో పనిచేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. 

ఈ నేథప్యంలో మిస్సింగ్‌ కేసుల విచారణను వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ ఎస్‌.సతీశ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో చింతపల్లి ఏఎస్పీ పర్యవేక్షణలో అన్నవరం ఎస్‌ఐ సాయికుమార్‌ సాంకేతిక పరిజ్ఞానంతో గోపాల్‌, లక్ష్మి ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. సహజీవనం చేస్తున్నట్టు తెలుసుకుని కాంతమ్మ హత్య గురించి గట్టిగా విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో కాంతమ్మ మృతదేహాన్ని (అస్థిపంజరం) వెలికితీసి చింతపల్లి సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహేశ్వరరావుతో పోస్టుమార్టం చేయించారు. కొన్ని శరీర భాగాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా అదే స్థలంలో తిరిగి ఖననం చేశారు. గోపాల్‌, లక్ష్మిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేఖరుల సమావేశంలో జీకేవీధి, చింతపల్లి సీఐలు అశోక్‌ కుమార్‌, సన్యాసినాయుడు, అన్నవరం ఎస్‌ఐ సాయికుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T06:19:30+05:30 IST