41 మంది ఖైదీలు విడుదల

ABN , First Publish Date - 2022-08-16T07:05:22+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని కేంద్ర కారాగారం నుంచి 41 మంది ఖైదీలను విడుదల చేశారు.

41 మంది ఖైదీలు విడుదల

- మొత్తం 42 మందికి అనుమతి...ఒక మహిళ విడుదల వాయిదా

- జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌


విశాలాక్షినగర్‌ (విశాఖపట్నం), ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని కేంద్ర కారాగారం నుంచి 41 మంది ఖైదీలను విడుదల చేశారు. సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 121వ నంబరు జీవో మేరకు 35 మంది జీవిత ఖైదీలు, సాధారణ ఖైదీలు మరో ఆరుగురు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మొత్తం 42 మంది ఖైదీల విడుదలకు అనుమతి లభించగా, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఒక మహిళ జరిమానా చెల్లించలేకపోవడంతో అందుకు బదులుగా మరో ఆరు నెలలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దీంతో ఆమె విడుదల వాయిదా పడిందని జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. విడుదలైన ఖైదీలంతా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందినవారు.  


విజయవాడకు పెరుగుతున్న విమాన ప్రయాణికులు 

ఏటీఆర్‌ స్థానంలో ఎయిర్‌బస్‌ నడిపిన ఇండిగో

సమయం మారిస్తే మరింత డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసుకు డిమాండ్‌ పెరుగుతోంది. అందుబాటులో పలు రైళ్లు ఉన్నా ప్రయాణ సమయం బాగా కలిసి వస్తుందని ఆకాశయానానికి మొగ్గు చూపుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్య మధ్యాహ్నం మూడు గంటలకు ఇండిగో సంస్థ ఏటీఆర్‌ విమానాన్ని 72 సీట్ల సామర్థ్యంతో నడుపుతోంది. తాజాగా ఆదివారం విజయవాడ వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో ఆ సంస్థ ఏటీఆర్‌ స్థానంలో 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్‌బస్‌ ఏ320ని నడిపింది. ఇటీవల కాలంలో ఇలా ఎయిర్‌బస్‌ నడపడం ఇదే మొదటిసారి. వాస్తవానికి విజయవాడ విమానం వేళలు మారిస్తే ఇంకా మంచి డిమాండ్‌ వుంటుందని ప్రయాణికుల సంఘం చెబుతోంది. విశాఖపట్నం నుంచి ఉదయం ఆరు గంటలకు ఒక సర్వీసును నడిపితే మంచి డిమాండ్‌ వుంటుందని అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో వున్న సర్వీసు అటుఇటు కాని సమయంలో ఉందనే వాదన వినిపిస్తోంది. 


మరో కొత్త విమానానికి ప్రతిపాదన

తిరుపతి-విజయవాడ-విశాఖపట్నం మధ్య కొత్త సర్వీసు నడపాలని కోరుతున్నట్టు ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రతినిధి విజయమోహన్‌ తెలిపారు. రాత్రి 8.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి 9.30 గంటలకు విజయవాడ చేరుకొని, అక్కడ నుంచి రాత్రి 10.30 గంటలకు విశాఖపట్నం వచ్చేలా షెడ్యూల్‌ ఖరారు చేయాలని కోరారు. ఈ విమానం రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే విజయవాడ మీదుగా తిరుపతికి నడిపితే చక్కటి ఆదరణ వుంటుందని ఆయన సూచించారు. అంతేకాకుండా విశాఖ నుంచి బ్యాంకాక్‌కు ఒక సర్వీసు నడపాలని సూచించామని, హైదరాబాద్‌-విజయవాడ-విశాఖపట్నం మీదుగా రాత్రిపూట విమానం వేసి, ఇక్కడి నుంచి ఆ విమానం రాత్రికి బ్యాంకాక్‌ బయలుదేరేలా షెడ్యూల్‌ ఇవ్వాలని కోరామన్నారు. కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చినందున డిమాండ్‌కు తగినట్టుగా సర్వీసులు వేయాలని ఇండిగోను కోరుతున్నామన్నారు. 

Updated Date - 2022-08-16T07:05:22+05:30 IST