ప్రాధాన్యతా భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-03-05T06:19:30+05:30 IST

ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు.

ప్రాధాన్యతా భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌


 జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున 

పాడేరు, మార్చి 4: ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాధాన్యత భవన నిర్మాణాల విషయంలో అలసత్వం వద్దని, వాటిని వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆర్‌బీకే, అంగన్‌వాడీ కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీల భవనల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని విస్మరించకూడదదని, వాటి ద్వారా ప్రజలకు సేవలన్నీ అందాలన్నారు. డ్వామా, పంచాయతీరాజ్‌ సిబ్బందికి అత్యవసరమైతే గాని ఈనెలలో సెలవులు ఇవ్వవద్దన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఆరు శాతం నిధులను కచ్చితంగా గిరిజాభివృద్ధికి కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. గిరిజన ఉప ప్రణాళిక అమలుపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ గిరిజన ఉప ప్రణాళిక కింద ఆరు శాతం నిధులను కేటాయించి గిరిజనాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖ, డీఆర్‌డీఏ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, సమగ్రశిక్షా, విద్యాశాఖ, మత్స్యశాఖ, పంచాయతీరాజ్‌ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. అలాగే వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తున్న గిరిజన ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం కల్పించాలన్నారు. ప్రభుత్వాధి కారులు సైతం వీడీవీకేల ఉత్పత్తులు కొనుగోలు చేయాలన్నారు. వీడీవీకేలను కుటీర పరిశ్రమగా గుర్తించి విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని ఏపీఈపీడీసీఎల్‌  అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను కలెక్టర్‌ అందించారు. అందుకు ముందు ఆయన పెదబయలు పీహెచ్‌సీకి కలెక్టర్‌ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్సును ప్రారంభించారు.  


 

Updated Date - 2022-03-05T06:19:30+05:30 IST