చెరువులో జారిపడి పీఆర్‌ ఏఈఈ మృతి

ABN , First Publish Date - 2022-08-14T06:30:28+05:30 IST

పాడేరులోని పంచాయతీరాజ్‌ శాఖ డివిజన్‌ కార్యాలయంలో ఏఈఈగా పనిచేస్తున్న ఎ.నవీన్‌సాయికృష్ణ(28) తన సొంతూరులో ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి మృతిచెందాడు.

చెరువులో జారిపడి పీఆర్‌ ఏఈఈ మృతి
ఎ.నవీన్‌సాయికృష్ణ (ఫైల్‌)


ఐదేళ్ల నుంచి పాడేరులో ఉద్యోగం 

వరుస సెలవులు రావడంతో  సొంతూరు రాక

పొలం చూడ్డానికి వెళుతుండగా ఘటన

రాంబిల్లి/పాడేరు, ఆగస్టు 13: పాడేరులోని పంచాయతీరాజ్‌ శాఖ డివిజన్‌ కార్యాలయంలో ఏఈఈగా పనిచేస్తున్న ఎ.నవీన్‌సాయికృష్ణ(28) తన సొంతూరులో ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి మృతిచెందాడు. రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ దీనబంధు తెలిపిన వివరాలు....  

నవీన్‌సాయికృష్ణ 2017లో ఇంజనీరింగ్‌ రిక్రూట్‌మెంట్‌లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచి, పాడేరులోని పంచాయతీరాజ్‌ డివిజన్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా విధుల్లో చేరాడు. ఐదేళ్ల నుంచి ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శని, ఆది, సోమవారాలు సెలవు కావడంతో శుక్రవారం పాడేరు నుంచి తన సొంతూరు అప్పారాయుడుపాలెం వచ్చాడు. సాయంత్రం 5 గంటల సమయంలో తమ పొలాన్ని చూసేందుకు సోదరుడు, మరో ఇద్దరితో కలిసి చెరువుగట్టు మీదుగా వెళుతున్నాడు. వర్షపడడంతో గట్టు బురదగా వుంది. దీంతో నవీన్‌సాయికృష్ణ ప్రమాదశావత్తూ చెరువులోకి జారిపడి మునిగిపోయాడు. పక్కనున్న వారు చెరువులో దిగి గాలించినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో గజఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. శనివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా పంచాయతీరాజ్‌ శాఖ ఏఈఈ నవీన్‌సాయికృష్ణ మృతిపట్ట పీఆర్‌ ఈఈలు శ్రీనివాసరావు, లావణ్యకుమార్‌, డీఈఈలు రవికుమార్‌, కొండయ్యపడాల్‌, ఏఈఈలు సంతాపం తెలిపారు. 


Updated Date - 2022-08-14T06:30:28+05:30 IST