ఖాకీల కలెక్షన్
ABN , First Publish Date - 2022-06-09T07:05:49+05:30 IST
జాతీయ రహదారిపై పశువులను రవాణా చేసే వాహనదారుల నుంచి హైవే పెట్రోలింగ్ పోలీసులు కాసులు దండుకుంటున్నారు.
హైవే పెట్రోలింగ్ సిబ్బంది మామూళ్ల దండుడు
పశువుల రవాణా వాహనాల నుంచి అక్రమ వసూళ్లు
నక్కపల్లి మండలంలో వెలుగు చూసిన వైనం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఏఎస్‌ఐ, హోంగార్డులకు జిల్లా కేంద్రం నుంచి పిలుపు
ఏఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు
అనకాపల్లి, జూన్ 8:
జాతీయ రహదారిపై పశువులను రవాణా చేసే వాహనదారుల నుంచి హైవే పెట్రోలింగ్ పోలీసులు కాసులు దండుకుంటున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. నక్కపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దందా అధికంగా జరుగుతున్నట్టు ఓ వీడియో ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఏఎస్‌ఐ, హోంగార్డులను జిల్లా కేంద్రానికి పిలిపించి మందలించడంతోపాటు ఏఆర్‌కు బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
జాతీయ రహదారిపై గస్తీ నిర్వహిస్తూ, వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చేయడంతోపాటు ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులను సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ రెండు దశాబ్దాల నుంచి హైవే పెట్రోలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నది.
ఈ విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక వాహనాన్ని కూడా సమకూర్చింది. అయితే పెట్రోలింగ్ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి మీదుగా పశువులను రవాణా చేసే వాహనాల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇది జిల్లాలో ఒకటి రెండు చోట్ల కాదు...పెందుర్తి నుంచి పాయకరావుపేట వరకు జాతీయ రహదారిపై వున్న అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై
ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువులను తరలిస్తున్న వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది, తమ పరిధి దాటగానే తదుపరి పోలీస్ స్టేషన్ పరిధిలో వుండే హైవే పెట్రోలింగ్ సిబ్బందికి వాహనం నంబరుతోసహా సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు రోడ్డుపై నిలబడి పశువులను తరలించే వాహనాన్ని ఆపుతున్నారు. వాహనం సిబ్బంది డబ్బులు చేతిలో పెట్టి ముందుకు వెళ్లిపోతున్నారు. జాతీయ రహదారిపై రోజూ 30 నుంచి 50 వరకు పశువుల రవాణా వాహనాల నుంచి హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 6వ తేదీన అడ్డరోడ్డు నుంచి తునివైపు వెళ్లే మార్గంలో నక్కపల్లి దుర్గాదేవి ఆలయానికి సమీపంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిలబడి, పశువుల రవాణా వాహనాల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ గౌతమిశాలి తీవ్రంగా స్పందించారు. సంబంధిత సిబ్బందిని గుర్తించి, తక్షణమే తన వద్ద హాజరుపర్చాలని ఆదేశించారు. వీడియోలో వున్న వ్యక్తులు నక్కపల్లి హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ రాజు, హోంగార్డు మూర్తిగా గుర్తించారు. వీరు మంగళవారం ఎస్పీ గౌతమిశాలి వద్దకు వెళ్లగా తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. అంతేకాక ఇద్దరినీ ఏఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.