దయచేసి భారత్‌కు తీసుకెళ్లండి...

ABN , First Publish Date - 2022-03-05T06:32:47+05:30 IST

రావికమతం, మార్చి 4: ‘ఉక్రెయిన్‌ నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి హంగరీ చేరుకున్నాం. ఇక్కడ ఎటూగాకుండా ఇరుక్కుపోయాం. దయచేసి ఆంధ్రాకు తీసుకువెళ్లండి.’ అని మండలంలోని తోటకూరపాలెం గ్రామానికి చెందిన రాజాన జగదీశ్‌ వేడుకుంటున్నాడు.

దయచేసి భారత్‌కు తీసుకెళ్లండి...
విద్యార్థి జగదీశ్‌

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాజాన జగదీశ్‌ విన్నపం

కుమారుడు కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

క్షేమంగానే ఉన్నాడని తహసీల్దార్‌ వెల్లడి


రావికమతం, మార్చి 4: ‘ఉక్రెయిన్‌ నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి హంగరీ చేరుకున్నాం. ఇక్కడ ఎటూగాకుండా ఇరుక్కుపోయాం. దయచేసి ఆంధ్రాకు తీసుకువెళ్లండి.’ అని మండలంలోని తోటకూరపాలెం గ్రామానికి చెందిన రాజాన జగదీశ్‌ వేడుకుంటున్నాడు. 

జగదీశ్‌ ప్రాథమిక విద్యను సొంతూరు తోటకూరపాలెంలోను, పదో తరగతి వరకు కన్నూరుపాలెం హైస్కూల్‌, ఇంటర్‌ విశాఖలో పూర్తిచేశాడు. అతని తండ్రి రాజాన గంగరాజు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి గృహిణి. డ్రైవర్‌ అయినప్పటికీ కుమారుడికి వైద్య విద్య పట్ల ఉన్న ఆసక్తిని గంగరాజు కాదనలేకపోయాడు. అప్పు చేసైనా చదివించేందుకు నియో కన్సల్టెన్సీ ద్వారా గత ఏడాది డిసెంబరులో వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపాడు. రెండు వారాలుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం సాగుతుండడం... అక్కడ జగదీశ్‌ చిక్కుకుపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ కనకారావు ఎంపీపీ పైల రాజుతో కలిసి గురువారం రాత్రి జగదీశ్‌ ఇంటికి వెళ్లారు. అతని తల్లిదండ్రులను పరామర్శించి జగదీశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్నందున అష్టకష్టాలు పడి సహచరులతో హంగరీ దేశానికి చేరుకున్నానని, ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదని, భారతదేశానికి తీసుకురావాలని తహసీల్దార్‌కు జగదీశ్‌ వేడుకున్నాడు. అధైర్య పడవద్దని, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. అలాగే జగదీశ్‌ క్షేమంగా ఉన్నాడని, త్వరలోనే తీసుకు వస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఏదేమైనా కుమారుడు ఇంటికి చేరేవరకూ తల్లిదండ్రలు ఆందోళనతో కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు.


Read more