పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు ప్రణాళిక

ABN , First Publish Date - 2022-12-31T00:52:46+05:30 IST

పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు ప్రతి పాఠశాల స్థాయిలో ప్రణాళిక తయారుచేసుకోవాలని కలెక్టర్‌ డాక్టరు ఎ.మల్లికార్జున పేర్కొన్నారు.

పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు ప్రణాళిక
వంద రోజుల ప్రణాళికను విడుదల చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

కలెక్టర్‌ మల్లికార్జున

విశాఖపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు ప్రతి పాఠశాల స్థాయిలో ప్రణాళిక తయారుచేసుకోవాలని కలెక్టర్‌ డాక్టరు ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ వ్యాలీ పాఠశాలలో ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించేలా టీచర్లంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. జీవితంలో పదో తరగతే కీలక దశ కాబట్టి ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, వారిలో అవగాహన కల్పించాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రతి విద్యార్థికి చేరువకావడానికి కృషి చేయాలన్నారు. నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని, అందువల్ల పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులై, ఉన్నత చదువుల్లోకి వెళ్లినపుడే పెట్టిన ఖర్చుకు సార్థకత ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను కలెక్టర్‌ విడుదల చేశారు. పరీక్షలపై పిల్లల్లో భయం పోగొట్టడానికి ఎక్కువగా నమూనా ప్రశ్నపత్రాలు ఇచ్చి ప్రాక్టీస్‌ చేయించాలని సూచించారు. పిల్లలు ఒత్తిడిని అధిగమించడానికి వ్యక్తిత్వ వికాస నిపుణులతో తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌..చంద్రకళ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాలలో తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం చేయడంతోపాటు జేవీకే కిట్లుతో వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్షా అభియాన్‌ ఏపీసీ బి.శ్రీనివాసరావు, డైట్‌ ప్రిన్సిపాల్‌ మాణిక్యాల నాయుడు, డిప్యూటీ డీఈవో గౌరీశంకర్‌, విశాఖ వ్యాలీ స్కూలు ప్రిన్సిపాల్‌ ఈశ్వరీ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:52:46+05:30 IST

Read more