ఆటలో కాసుల వేట
ABN , First Publish Date - 2022-08-10T06:36:28+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు క్రీడా రంగాన్ని వ్యాపారంగా మారుస్తున్నాయి.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మైదానాలు
పే అండ్ ప్లే...పైసలు చెల్లిస్తేనే ప్రవేశం...సాధన...శిక్షణ
క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరం
పాలకుల తీరుపై క్రీడా సంఘాల ఆగ్రహం
విశాఖపట్నం (స్పోర్ట్సు), ఆగస్టు 9:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు క్రీడా రంగాన్ని వ్యాపారంగా మారుస్తున్నాయి. ఆదాయం కోసం క్రీడా ప్రాంగణాలను ప్రైవేటుపరం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పే అండ్ ప్లే (చెల్లించు...ఆడు) విధానాన్ని ఇతర సంస్థలు కూడా అనుసరిస్తూ క్రీడాకారుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి. పైసలు చెల్లిస్తేనే గానీ క్రీడా మైదానంలోకి అడుగు పెట్టలేని పరిస్థితులు తీసుకువస్తున్నాయి. దీంతో క్రీడాకారుల భవిష్యత్తు, క్రీడా రంగ అభివృద్ధి అగమ్యగోచరంగా మారాయి.
నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన ప్రాంగణాలు, రైల్వే క్రీడా సముదాయాలు ఇప్పటికే కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్లిపోగా...తాజాగా పోర్టు కూడా క్రీడా ప్రాంగణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఫీజు చెల్లిస్తేగానీ మైదానంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి తలెత్తుతోంది.
ఇదేనా ప్రోత్సాహం
గ్రామీణ, పట్టణ బాలబాలికలను క్రీడా రంగం వైపు అడుగులు వేయించాల్సిన క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు క్రీడాకారుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సిన శాప్...స్టేడియాలకు వచ్చే క్రీడాకారుల నుంచి యూజర్ చార్జీల పేరిట ఫీజులు వసూలు చేస్తోంది. అంతేకాకుండా జిల్లా, రాష్ట్ర లీగ్ పేరిట టోర్నీలు నిర్వహించి క్రీడాకారుల నుంచి ఎంట్రీ ఫీజులు తీసుకుంటోంది. నిధులు వెచ్చించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సి క్రీడా ప్రాధికార సంస్థ...ఇలా టోర్నీల నిర్వహణ పేరిట డబ్బులు వసూలుచేయడం విస్మయపరుస్తోంది.
శాప్ మైదానాలు ప్రైవేటుపరం
యూజర్ చార్జీల రూపంలో ఆశించిన స్థాయిలో సొమ్ములు రాకపోవడంతో శాప్ క్రీడా ప్రాంగణాలను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా కొమ్మాదిలోని క్రీడా మైదానంతోపాటు గోపాలపట్నంలోని ఇండోర్ స్టేడియం, ఎలమంచిలిలోని మినీ స్టేడియాలను కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. దీంతో ఆయా క్రీడా ప్రాంగణాల్లో అడుగుపెట్టాలంటే క్రీడాకారులు తప్పనిసరిగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. సాధారణంగా ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, అథ్లెటిక్స్ వంటి పలు క్రీడాంశాలలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారు ఉంటారు. ఫీజులు చెల్లించి మైదానంలోకి ప్రవేశించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో అటువంటి వారంతా క్రీడలకు స్వస్తి పలుకుతున్నారు.
రైల్వే క్రీడా ప్రాంగణాలు ప్రైవేటుపరం
నగరంలోని రైల్వే క్రీడా ప్రాంగణాలు ఇప్పటికే ప్రైవేటు పరమయ్యాయి. కోట్ల రూపాయల వ్యయంతో అధునికీకరించిన క్రికెట్ స్టేడియం, కొత్తగా నిర్మించిన ఇండోర్ స్పోర్ట్సు ఎన్క్లేవ్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ గ్రౌండ్లతోపాటు వాకర్స్ పార్కును కూడా చడీచప్పుడు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేశారు. దీంతో క్రీడల సాధనతోపాటు ఆరోగ్యం కోసం నడిచేందుకు కూడా ఫీజులు చెల్లించి మైదానంలోకి ప్రవేశించాల్సిన పరిస్థితి నెలకొంది.
పోర్టు స్టేడియం ప్రైవేటుపరం చేసే యోచన
నగరంలో చెప్పుకోదగ్గ క్రీడా సముదాయాల్లో పోర్టు అథారిటీ స్టేడియం ముందువరుసలో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల నిర్వహణకు అనుకూలమైనదిగా గుర్తింపు కలిగిన ఈ స్టేడియాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. అయితే దీనిపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఘన చరిత్ర కలిగిన స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రతిపాదనను విరమించుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. క్రీడాకారుల భవిష్యత్తు, క్రీడా రంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పోర్టు అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులను కూడా పలువురు కోరినట్టు సమాచారం.
