తెరుచుకున్న స్కూళ్లు
ABN , First Publish Date - 2022-07-06T06:21:57+05:30 IST
వేసవి సెలవుల తరువాత ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభం అయ్యాయి.

తొలి రోజు అంతంత మాత్రంగానే హాజరు
పలు పాఠశాలల్లో 50 శాతంకన్నా తక్కువ మంది రాక
మంగళవారం సెంటిమెంట్‌తో పిల్లలను బడికి పంపని తల్లిదండ్రులు
పనిచేయని హాజరు నమోదు పరికరాలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
వేసవి సెలవుల తరువాత ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభం అయ్యాయి. సాధారణంగా వేసవి సెలవుల అనంతరం ఏటా జూన్ రెండో వారంలో పాఠశాలలను తెరుస్తుంటారు. కానీ కొవిడ్-19 ప్రభావంతో గత విద్యా సంవత్సరంలో మే ఐదో తేదీ వరకు తరగతులు నిర్వహించడంతో ఈ ఏడాది కొంత ఆలస్యంగా పాఠశాలలను తెరిచారు. అయితే తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే వుంది. విద్యా కానుక కిట్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సగం మంది కూడా పాఠశాలలకు రాకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. అయితే ‘మంగళవారం సెంటిమెంట్’తో తల్లిదండ్రులు తొలి రోజు పిల్లలను బడికి పంపలేదని తెలిసింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు ఎక్కడా పనిచేయలేదు. దీంతో హాజరు వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయలేదు. కాగా ఈ నెల 5వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని, ఇదే రోజు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు విద్యార్థులంతా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని, విద్యా కానుక కిట్లు పంపిణీని అట్టహాసంగా నిర్వహించాలని ఆదేశించింది. ముందస్తు ఏర్పాట్ల కోసం జూన్ 30వ తేదీ నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పాఠశాలలు తెరిచిన తొలిరోజు జిల్లాలో సగం మంది విద్యార్థులు కూడా హాజరు కాదు. విద్యార్థుల హాజరు కోసం ప్రత్యేకంగా రూపొందించిన అటెండెన్స్ యాప్, ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్ రిజిస్టర్ తొలిరోజు పనిచేయలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. .
అనకాపల్లి మండలం మామిడిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 750 మంది విద్యార్థులు వుండగా, మంగళవారం 35 మంది మాత్రమే హాజరయ్యారు. అనకాపల్లి గవరపాలెం బాలికల హైస్కూల్లో 450 మందికిగాను 210 మంది హాజరయ్యారు. రోలుగుంట జడ్పీ హైస్కూల్లో 327 మంది విద్యార్థులకు 120 మంది, మునగపాక మండలం నాగులాపల్లి జడ్పీ హైస్కూల్లో 357 మంది విద్యార్థులకు 101 మంది విద్యార్థులు మాత్రమే వచ్చారు.
వల్సంపేటలో వంది మందికి ఆరుగురే హాజరు!
నాతవరం: మండలంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలకు మొదటి రోజు చాలా తక్కువ మంది హాజరయ్యారు. తాండవ ఏటి అవతల ఉన్న చాలా పాఠశాలలకు 10 శాతం మంది కూడా రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వల్సంపేట పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉండగా మంగళవారం ఆరుగురు మాత్రమే వచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు మంగళవారం కావడంతో చాలమంది తల్లిదండ్రులు సెంటిమెంట్‌గా భావించిన పిల్లలను బడికి పంపలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.