ఊపందుకున్న వరి నాట్లు

ABN , First Publish Date - 2022-08-09T06:30:41+05:30 IST

జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. గత నాలుగు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తుండడంతో వరి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో సాధారణంగా వరి నాట్లు ఆగస్టు మొదటి వారం నుంచి మొదలవుతాయి.

ఊపందుకున్న వరి నాట్లు
దేవరాపల్లి మండలంలో వరి నాట్లు వేస్తున్న మహిళా రైతులు

- వర్షాలు కురుస్తుండడంతో పనుల్లో రైతులు నిమగ్నం

జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. గత నాలుగు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తుండడంతో వరి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో సాధారణంగా  వరి నాట్లు ఆగస్టు మొదటి వారం నుంచి మొదలవుతాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు.

                       (అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఈ నెలలో అధికంగానే నమోదైంది. సాధారణ వర్షపాతం 318 మిల్లీ మీటర్లు కాగా, శనివారం నాటికి 336 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కేవలం బుచ్చయ్యపేట, అనకాపల్లి, రోలుగుంట మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. జిల్లాలో 21 మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం కురిసింది. మొత్తం మీద జిల్లాలో ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే 15.3 శాతం అధికంగా వర్షం కురిసింది. ఖరీఫ్‌లో వివిధ పంటల సాగు జూన్‌ మాసంలో ప్రారంభమవుతుంది. జూన్‌ నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 62 మిల్లీమీటర్లు కాగా 118 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 161 మిల్లీ మీటర్లు కాగా కేవలం 139.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాతవరం, దేవరాపల్లి, చీడికాడ, చోడవరం, బుచ్చయ్యపేట, కోటవురట్ల, మాడుగుల మండలాల్లో తక్కువ వర్షం కురిసింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పెద్దగా వర్షాలు లేకపోయినా ఇప్పుడిప్పుడే అడపా దడపా వర్షాలు కురుస్తుండడంతో సాగునీటి ఇబ్బందులు అంతగా లేవు. దీంతో రైతులు ఖరీఫ్‌ సాగుపై ఆశలు పెట్టుకున్నారు.

జోరుగా పొలం పనులు

అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్‌ వరి సాగు సాధారణ విస్తీర్ణం 54,493 హెక్టార్లు కాగా, ఇప్పటికే 6,992 హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయి. దాదాపు జిల్లాలో 24 మండలాల్లో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వరి నారుమళ్లు తయారు చేసుకోవడంతో గ్రామాల్లో ఆకుతీత, ఊడ్పుల పనులు జోరందుకున్నాయి. పలు మండలాల్లో నారుమళ్లు తయారు చేసుకున్న రైతులు నాట్లు వేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వరి నాట్లు వేసే సమయంలో పొలం తయారీ, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. కాగా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో లేవని రైతులు వాపోతున్నారు. వాటిని అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసుకోవలసి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. 

నెలాఖరుకు వరినాట్లు పూర్తి

ఈ నెలాఖరుకు జిల్లాలో అన్ని మండలాల్లో అనుకున్న లక్ష్యాల మేరకు వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగుల నియోజకవర్గాల్లో 30 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాట్లు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. 

- లీలావతి, జిల్లా వ్యవసాయధికారి, అనకాపల్లి


Updated Date - 2022-08-09T06:30:41+05:30 IST