అన్‌రాక్‌పై అవ్యాజ ప్రేమ!

ABN , First Publish Date - 2022-07-18T06:28:41+05:30 IST

‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా!’ అన్నది నాటి సామెత... ‘పాలకులు తలచుకుంటే అస్మదీయులకు పెద్దపీట’ అన్నది నేటి నానుడి.

అన్‌రాక్‌పై అవ్యాజ ప్రేమ!
రాచపల్లిలో ఉన్న అన్‌రాక్‌ కంపెనీ నిర్మాణం

ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు కంపెనీ అవసరాలకు రోడ్డు నిర్మాణం

తాళ్లపాలెం నుంచి రామన్నపాలెం వరకు రహదారి విస్తరణ

నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడానికి రూ.110 కోట్లతో ప్రతిపాదనలు

రోడ్డుకి ఇరువైపులా ఉన్న సర్వే నంబర్లు సేకరిస్తున్న రెవెన్యూ సిబ్బంది


మాకవరపాలెం, జూలై 17: 

‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా!’ అన్నది నాటి సామెత... ‘పాలకులు తలచుకుంటే అస్మదీయులకు పెద్దపీట’ అన్నది నేటి నానుడి. తమవాళ్లు అనుకున్నవారికి ఎన్ని రకాల మేళ్లు చేయడానికైనా నేటి పాలకులు సిద్ధపడుతున్నారు. అవసరమైతే నిబంధనలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు. అస్మదీయులకు మేలు చేసేలా ప్రజల అవసరాల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ... కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ నుంచి మాకవరపాలెం మండలం రామన్నపాలెం వరకు ఆర్‌అండ్‌బీ రహదారిని నాలుగులేన్లుగా విస్తరణ ప్రతిపాదనలు. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన వారికి చెందిన అన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీకి ముడిసరకు రవాణా, ఉత్పత్తుల ఎగుమతి కోసం రూ.110 కోట్లతో  రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు. భూసేకరణ కోసం రెవెన్యూ సిబ్బంది రహదారికి ఇరువైపులా వున్న భూముల సర్వే నంబర్లు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పెన్నా సిమెంట్స్‌ ప్రతాపరెడ్డి ప్రధాన భాగస్వామ్యంతో మాకవరపాలెం మండలం రాచపల్లిలో సుమారు రూ.5,600 కోట్లతో అన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌(ఏఏఎల్‌) నిర్మాణం చేపట్టారు. ప్రధాన ముడిసరకు అయిన బాక్సైట్‌ కోసం అప్పట్లో ఏపీఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి రిజర్వు ఫారెస్టులో బాక్సైట్‌ ఖనిజాన్ని తవ్వి, అన్‌రాక్‌ కంపెనీకి సరఫరా చేయాలి. ఈ ఒప్పందంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగడం, గిరిజనులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బాక్సైట్‌ తవ్వకాలకు బ్రేకులు పడి, అన్‌రాక్‌లో ఉత్పత్తి ప్రారంభం కాలేదు. దీంతో అన్‌రాక్‌ కంపెనీ యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇతర ప్రాంతాల నుంచి ఖనిజాన్ని దిగుమతి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాలని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నది. ఒడిశాలోని దమన్‌జోడి నుంచి బాక్సైట్‌ తెచ్చుకోవడానికి ఆ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థతో సంప్రదింపులు జరిపినా, ఫలితం లేకపోయింది. దీంతో గత ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియా నుంచి బాక్సైట్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి మొదలైంది. విశాఖలోని పోర్టులకు దిగుమతి చేసుకుంటున్న బాక్సైట్‌ను భారీ వాహనాల ద్వారా ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇందుకోసం 100 వరకు వాహనాలను వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయి ఉత్పత్తికి చేరుకుంటే బాక్సైట్‌ వినియోగం మరింత పెరుగుతుంది. దీంతో రోజూ 150 నుంచి 200 వరకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.

 తాళ్లపాలెం-రామన్నపాలెం రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ 

విశాఖ నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి వుంది. ఇక్కడి నుంచి మాకవరపాలెం మీదుగా నర్సీపట్నం వరకు రెండు లేన్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు వుంది. ప్రస్తుతం ఇది 23 నుంచి 26 అడుగుల వెడల్పు మాత్రమే వుంది. అన్‌రాక్‌ కంపెనీకి బాక్సైట్‌ తరలించే వాహనాలతో ఈ మార్గం రద్దీగా మారింది. దీంతో తాళ్లపాలెం నుంచి రామన్నపాలెం వరకు (అన్‌రాక్‌ కంపెనీ జంక్షన్‌) 17 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించి, ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణకు రూ.110 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వానికి నివేదించారు. దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు.. తాళ్లపాలెం నుంచి రామన్నపాలెం వరకు రోడ్డుకి ఇరుపక్కల ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆయా వీఆర్వోలు గత రెండు రోజుల నుంచి తాళ్లపాలెం, భీమవరం, లాలంకోడూరు, కన్నూరిపాలెం, శెట్టిపాలెం, భీమబోయినపాలెం, రాచపల్లి, రామన్నపాలెం గ్రామాల్లో ఆర్‌అండ్‌బీ రోడ్డుకి ఇరువైపులా వున్న భూముల సర్వే నంబర్లు సేకరిస్తున్నారు.

అన్‌రాక్‌ అవసరాల కోసం ప్రజా ధనం ఖర్చు!

రహదారుల విస్తరణ, అభివృద్ధిని ఎవరూ కాదనరు. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులకు లేదా సంస్థలకు మేలు చేసే విధంగా ప్రజాధనంతో రోడ్ల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం పూనుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ప్రజల అవసరాల కోసమే రహదారిని విస్తరిస్తున్నట్టు అయితే తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం వరకు అభివృద్ధి చేయాలి. కానీ మధ్యలో అన్‌రాక్‌ కంపెనీ వరకే రోడ్డు విస్తరించాలని ప్రతిపాదించడం, దీని కోసం రూ.110 కోట్ల ప్రజాఽధనాన్ని ఖర్చు చేయనుండడం పై ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. 

కాగా రహదారి విస్తరణపై రోడ్లు, భవనాల శాఖ డీఈ వేణుగోపాల్‌ని వివరణ కోరగా.. అన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీ నుంచి తాళ్లపాలెం వరకు నాలుగు  వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని చెప్పారు. ప్రస్తుత రహదారి 23 అడుగుల వెడల్పు వుందని, దీనిని 60 అడుగులకు విస్తరించాల్సి వుంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.


Updated Date - 2022-07-18T06:28:41+05:30 IST