తెలంగాణ సిట్‌ నుంచి నోటీసులు అందలేదు

ABN , First Publish Date - 2022-11-25T02:37:28+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ సిట్‌ నుంచి నోటీసులు అందలేదు

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రూ.వంద కోట్ల లావాదేవీలు అంటూ జగన్‌ సొంత చానల్‌, పత్రికలో ప్రచారం చేస్తున్నారని, ఆ సంస్థలకు సిట్‌ అధికారులు ముందుగానే నోటీసులు పంపారా అని ప్రశ్నించారు. తనకు జారీ చేసిన నోటీసు కాపీ బయటకు మాత్రం రాలేదన్నారు. తెలంగాణలో శాసనసభ్యుల కొనుగోలుతో ఆంధ్రా ఎంపీగా ఉన్న తనకు సంబంధం ఏమిటని, ఆ రాష్ట్ర రాజకీయాలతో తనకు లింకు ఏమిటని రఘురామ ప్రశ్నించారు. తాను రూ.100 కోట్లు ఇస్తానని వచ్చిన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు జరపాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో తనను బలవంతంగా ఇరికించాలని ఎ1, ఎ2లు ఒత్తిడి తెచ్చుంటారేమోనని అనుమానంగా ఉందన్నారు. కలలో కూడా అలాంటి పనులతో తనకు సంబంధం లేదన్నారు. తాను హిందువును కాబట్టి స్వామీజీలను కలవడం సర్వసాధారణమన్నారు. విజయసాయిరెడ్డి ఫోన్‌ ఎక్కడా పోలేదని, ఆయనే దాచిపెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించిన ఆధారాలు మాయం చెయ్యడానికే ఫోన్‌ పోయిందని నాటకం మొదలు పెట్టారని ఆరోపించారు.

Updated Date - 2022-11-25T02:37:30+05:30 IST