నల్ల చున్నీలకు నో ఎంట్రీ..!

ABN , First Publish Date - 2022-11-22T01:42:58+05:30 IST

సీఎం జగన్‌ సభలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ..

నల్ల చున్నీలకు నో ఎంట్రీ..!

నిరసనల భయంతో ‘అతి’

సీఎం జగన్‌ సభలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. నల్ల చున్నీలు ధరించివచ్చిన మహిళలను గేట్‌ వద్దే ఆపేశారు. చున్నీలను బలవంతంగా తీయించివేశారు. దీనిపై మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల చర్యను ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అన్నారు. స్వాధీనం చేసుకున్న చున్నీలను గేటు వద్దనున్న కర్రలపై పడేశారు. వర్షం పడుతుందన్న భయంతో నల్ల గొడుగులు తెచ్చుకున్న మహిళలకు కూడా చేదు అనుభవమే మిగిలింది. గేటు వద్దే గొడుగుల్ని స్వాదీనం చేసుకున్నారు. దీంతో చాలామంది నిరసన తెలుపుతూ ఇంటి ముఖం పట్టా రు. ఇంతకీ నల్ల రంగును చూసి పోలీసులు ఎందుకు భయపడ్డారు? జగన్‌ సభలో నిరసనలకు తావు లేకుం డా చేసేందుకు చేసిన ఏర్పాట్లలో ఇదీ ఒక భాగమట!

పది నిమిషాల్లోనే పరార్‌...

తీసుకొచ్చారు.. వెళ్లిపోయారన్న చందాన సీఎం బహిరంగ సభకు వచ్చిన జనం ఆయన రాకుండానే మెల్లగా తమను తరలించిన వాహనాల వద్దకు వెళ్లిపోయారు. జగన్‌ మధ్యాహ్నం 12.35 గంటలకు తన ప్రసంగం ప్రారంభించారు. ఆ తర్వాత పది నిమిషాలకే జనంలో కదలిక ప్రారంభమైంది. 12.45 గంటలయ్యేసరికి వేదికకు దక్షిణ వైపు ఉన్న టెంట్‌లోని జనం లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. సీఎం ప్రసంగం 1.11 గంటల వరకు సాగింది. ఈ లోపులోనే సభకు తరలించినవారిలో చాలామంది తమ వాహనాల వద్దకు వెళ్లిపోయారు. వీరందరూ వరుసగా 3 గంటలు జగన్‌ రాక కోసం ఎదురుచూశారు. వేచి ఉన్నవారికి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో.. సీఎం వచ్చి సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేశారు. నిజానికి, నరసాపురంలో ముఖ్యమంత్రి పర్యటన గత నెల రోజుల్లో నాలుగుసార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఖరారైంది. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ ముదునూరి ప్రసాదరాజు... భారీ తరలింపులకు వీలుగా ప్రత్యేకంగా రవాణా వసతి కల్పించారు. అయితే, తుఫాన్‌ ప్రభావంతో చినుకులు పడటంతో సభా వేదిక ప్రాంగణం జనంతో నిండిపోయింది. దీనివల్ల ఆ తర్వాత వచ్చిన వారికి నిలబడటానికి అవకాశం లేకపోయింది. దీంతో వారంతా వెనక్కి మరలారు. వారిని తీసుకొచ్చిన వార్డు వలంటీర్లు, సచివాలయ కార్యదర్శుల మాటను సైతం వినలేదు.

Updated Date - 2022-11-22T01:43:06+05:30 IST