ఆదాయంపై అలక్ష్యం

ABN , First Publish Date - 2022-11-30T00:39:49+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల నిర్లిప్తత వైఖరి వల్ల ఆదాయానికి గండి పడుతున్నది. అనకాపల్లి జోన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వున్న దుకాణ సముదాయాల నిర్వహణ అధ్వానంగా వుంది. దాదాపు సగం షాపులు ఖాళీగా వున్నాయి. లీజుకు ఇచ్చిన మిగిలిన షాపుల నుంచి సగం మాత్రమే అద్దెలు వసూలు అవున్నాయి. మొత్తం మీద నెలకు పది లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నది.

ఆదాయంపై అలక్ష్యం
ఖాళీగా ఉన్న చిన్న హైస్కూల్‌ షాపింగ్‌ కాంప్లెక్సు దుకాణాలు

అనకాపల్లిలో ఖాళీగా జీవీఎంసీ దుకాణాలు

మొత్తం 154 షాపులు... ప్రస్తుతం వృథాగా 64

శిథిలావస్థలో మరో ఎనిమిది షాపులు

83 దుకాణాల నుంచి సగమే ఆదాయం

రూ.6 లక్షలకుగాను రూ.3 లక్షలు మాత్రమే అద్దె వసూలు

పట్టించుకోని జీవీఎంసీ ఉన్నతాధికారులు

అనకాపల్లి అర్బన్‌, నవంబరు 29: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల నిర్లిప్తత వైఖరి వల్ల ఆదాయానికి గండి పడుతున్నది. అనకాపల్లి జోన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వున్న దుకాణ సముదాయాల నిర్వహణ అధ్వానంగా వుంది. దాదాపు సగం షాపులు ఖాళీగా వున్నాయి. లీజుకు ఇచ్చిన మిగిలిన షాపుల నుంచి సగం మాత్రమే అద్దెలు వసూలు అవున్నాయి. మొత్తం మీద నెలకు పది లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నది.

అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ కార్యాలయం పక్కన, హైస్కూల్‌ను ఆనుకొని, మునిసిపల్‌ గ్రౌండ్‌ చుట్టూ, ఉడ్‌పేటలో, గవరపాలెం బాలిక హైస్కూల్‌ ప్రాంగణంలో, సర్వకామదాంబ పార్కు వద్ద, రాజీవ్‌గాంధీ ఇన్‌డోర్‌ స్టేడియం వద్ద, న్యూ కాలనీలో, సతకంపట్టు వద్ద, మునిసిపల్‌ పట్టణ బాలికల హైస్కూలు, పెరుగుబజారు వద్ద మొత్తం 159 షాపులు ఉన్నాయి. మునిసిపాలిటీగా వున్నప్పుడు ఆదాయాన్ని సమకూర్చేందుకు అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని దుకాణ సముదాయాలను నిర్మించారు. షాపుల అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం మునిసిపల్‌ సిబ్బంది జీతాల చెల్లింపునకు ఉపయోగపడేది. అనకాపల్లి మునిసిపాలిటీ జీవీఎంసీలో విలీనమైన తరువాత వాణిజ్య సముదాయాల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. నెలవారీ అద్దె డబ్బులను సక్రమంగా వసూలు చేయడంలేదు. మొత్తం 159 షాపులకుగాను ప్రస్తుతం 64 షాపులు ఖాళీగా ఉన్నాయి. ఎనిమిది దుకాణాలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. నాలుగు షాపులను జీవీఎంసీ అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన 83 షాపుల నుంచి అద్దెల రూపంలో నెలకు రూ.6.09 లక్షలు ఆదాయం రావాలి. కానీ రూ.3 లక్షలు మాత్రమే వసూలవుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో కొంతమంది లీజుదారులు అద్దెలు చెల్లించడంలేదని తెలిసింది. జీవీఎంసీ రెవెన్యూ అధికారులు, ఆయా దుకాణాల వద్దకు వెళ్లి అద్దె చెల్లించాలని అడిగితే... క్షణాల్లో అధికార పార్టీకి చెందిన ఏదో ఒక నాయకుడి నుంచి ఫోన్‌ వస్తుంది. సదరు నేత ఒత్తిడితో అద్దె వసూలు చేయకుండా సిబ్బంది వెనుతిరుగుతున్నారు. జీవీఎంసీ దుకాణాల అద్దె బకాయిలు కోటి రూపాయలకుపైగా వుంటాయని కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు. కాగా శిథిలావస్థకు చేరుకున్న షాపులకు మరమ్మతులు చేయించడంలో కూడా అధికారులు శ్రద్ధ చూపడం లేదు.

Updated Date - 2022-11-30T00:42:21+05:30 IST