ప్రశాంతంగా నీట్‌

ABN , First Publish Date - 2022-07-18T06:40:00+05:30 IST

అండర్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యకోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు-2022 (నీట్‌) ఆదివారం ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా నీట్‌
పరీక్ష కేంద్రంలోకి వరుసక్రమంలో వెళ్తున్న విద్యార్థులు

94.73 శాతం అభ్యర్థులు హాజరు

ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తీసుకురాని వారిలో టెన్షన్‌

సిటీ కోఆర్డినేటర్‌ జోక్యంతో రఘు ఇంజనీరింగ్‌ కళాశాలలో అనుమతి

విద్యార్థినుల ముక్కుపుడకలు, చెవిదిద్దులు, కాళ్లపట్టీల తొలగింపులో ఇబ్బందులు

పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ జామ్‌


విశాఖపట్నం/తగరపువలస/ఆరిలోవ, కొమ్మాది, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అండర్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యకోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు-2022 (నీట్‌) ఆదివారం  ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 12 కేంద్రాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 7,792 మందికి గాను 7,382 (94.73 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రూపొందించిన నిబంధనలను నిర్వాహకులు పక్కాగా అమలుచేశారు. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైనా దాదాపు అన్ని కేంద్రాలకు ఉదయం 10 గంటల సమయానికే అభ్యర్థులు, వారికితోడుగా తల్లిదండ్రులు, మిత్రులు చేరుకున్నారు. ఉదయం 11గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ సమయంలో నీట్‌ అడ్మిట్‌ కార్డు, ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు/ కలర్‌ జెరాక్స్‌ను పరిశీలించారు. దాకమర్రి రఘు ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు/ కలర్‌ జెరాక్స్‌ తీసుకురాని పదిమంది అభ్యర్థులను అనుమతించలేదు. దీంతో వారితో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పరీక్షల సిటీ కో ఆర్డినేటర్‌, విశాఖ వ్యాలీ స్కూలు ప్రిన్సిపాల్‌ ఈశ్వరి ప్రభాకర్‌కు ఫోన్‌ చేయడంతో ఆమె స్పందించి రఘు కళాశాల పరిశీలకుడికి ఫోన్‌చేశారు. దీంతో వారిని పరీక్షకు అనుమతించారు. కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్నం 1.30 గంటలు దాటిన ఒకటి రెండు నిమిషాల తరువాత కేంద్రాలకు అభ్యర్థులు వచ్చినా అనుమతించారు. అభ్యర్థుల్లో ముఖ్యంగా బాలికలు చెవిదిద్దులు, ముక్కుపుడకలు, కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు, బెల్టులతో రావద్దని అడ్మిట్‌ కార్డులో పేర్కొన్నప్పటికీ, కొందరు వాటిని ధరించి వచ్చారు. దీంతో అవి తొలగించి లోపలకు రావాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చెవిదిద్దులు, ముక్కపుడకలు తొలగించడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. పలు పరీక్ష కేంద్రాలను సిటీ కో ఆర్డినేటర్‌ ఈశ్వరి ప్రభాకర్‌ సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఇదిలావుండగా ఉదయం పదిగంటలకే ఆయా కేంద్రాలకు అభ్యర్థులు, తల్లిదండ్రులు కార్లు, ఇతర వాహనాలపై రావడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. కేంద్రాలవద్ద పెద్దసంఖ్యలో వీరంతా గుమిగూడడంతో అభ్యర్థులు లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం పరీక్ష రాసి బయటకు వచ్చిన సమయంలో వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. Read more