వృద్ధ దంపతుల హత్యపై వీడని మిస్టరీ

ABN , First Publish Date - 2022-08-10T06:23:54+05:30 IST

సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల హత్య కేసులో మిస్టరీ వీడలేదు.

వృద్ధ దంపతుల హత్యపై వీడని మిస్టరీ

వివిధ కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీసులు

పెందుర్తి, ఆగస్టు 9: సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. చినముషిడివాడలోని సప్తగిరినగర్‌ సమీపంలో నిర్మాణంలో వున్న అపార్టుమెంటులోని సెల్లార్‌లో సోమవారం వృద్ధ దంపతులు ఎస్‌.అప్పారావు, లక్ష్మి హత్యకు గురైన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసులు గతంలో ఇదే అపార్డ్‌మెంటులో వాచ్‌మన్‌గా పనిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయన నుంచి ఎటువంటి సమాచారం లభ్యం కాకపోవడంతో విడిచిపెట్టినట్టు తెలిసింది. అలాగే మంగళవారం ఏసీపీ పెంటారావు, సీఐ అశోక్‌కుమార్‌ అపార్ట్‌మెంటులో పనులు చేస్తున్న వారిని విచారించారు. పరిసర ప్రాంతంలో వుంటున్న వారితో మాట్లాడి తరచూ ఇక్కడకు ఎవరెవరు వస్తుంటారు, వృద్ధ దంపతులతో సఖ్యంగా మెలిగే వారి గురించి ఆరా తీశారు. మద్యం సేవించే అలవాటు వున్న అప్పారావుకు ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా? అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో మత్తుకు బానిసైన కొంతమంది అకతాయిలను ప్రశ్నించినట్టు సమాచారం. కాగా ఈ కేసును ఛేదించేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.Read more