నా బిడ్డది ముమ్మాటికీ హత్యే
ABN , First Publish Date - 2022-08-18T06:27:27+05:30 IST
తన కుమారుడ్ని పథకం ప్రకారం ముగ్గురు యువకులు హత్య చేశారని, దీనిపై నెలలు గడుస్తున్నా ఎందుకు న్యాయం జరగలేదని మృతుడి తల్లి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

గ్రామస్థులు, పెద్దలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ ఆందోళన
నక్కపల్లి, ఆగస్టు 17 : తన కుమారుడ్ని పథకం ప్రకారం ముగ్గురు యువకులు హత్య చేశారని, దీనిపై నెలలు గడుస్తున్నా ఎందుకు న్యాయం జరగలేదని మృతుడి తల్లి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలివి. నక్కపల్లి మండలం అమలాపురం గ్రామానికి చెందిన చిట్టిమణి సత్తిబాబు మృతదేహాన్ని గత మే ఒకటో తేదీన గుల్లిపాడు రైల్వే ట్రాక్‌పై రైల్వే పోలీసులు గుర్తించారు. 30వ తేదీ రాత్రి తన ఇంటి వద్ద నుంచి వెళ్లిన సత్తిబాబు ఇంటికి రాకపోవడంతో అతని సెల్‌కు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఈ ఫోన్‌ను గుల్లిపాడు రైల్వేట్రాక్ వద్ద సిబ్బంది లిఫ్ట్ చేసి, ఎవరో యువకుడి మృతదేహం పట్టాలపై ఉందని తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు తుని రైల్వే పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే, ఏప్రిల్ 30న ఇదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు యువకులు తన కుమారుడికి మద్యం పట్టించి, బైక్‌పై తీసుకెళ్లినట్టు అప్పట్లో సత్తిబాబు తల్లి రమణమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు స్నేహితులు ముగ్గుర్నీ పోలీసులు విచారించారు. అయితే తమ కుమారుడ్ని స్నేహితులు ముగ్గురు చంపలేదని అబద్దం చెబుతున్నారని, తమ కుమారుడ్ని రాత్రి వేళలో తీసుకెళ్లినట్టు సీసీ పుటేజీలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. తక్షణమే ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జాతీయ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు మోసా అప్పలరాజు, సర్పంచ్ పెదపూడి శంకరరావు, ఉప సర్పంచ్ గంటా నర్సింగరావు, టీడీపీ నేత ఎరుపిల్లి అప్పలరాజు, బీజేపీ నాయకుడు పోలినాటి నానాజీ, రాకాతి రాజు, పారా జోగుల తాత, పి.నానాజీ తదితరులు హెచ్చరించారు. దీంతో స్థానిక పోలీసులు సీఐ నారాయణరావుకు సమాచారం ఇచ్చారు. ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం వారం రోజుల వరకూ ఆగమని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.