ముత్తంశెట్టికి నిరసన సెగ
ABN , First Publish Date - 2022-12-31T01:51:21+05:30 IST
మండలంలోని మజ్జిపేట గ్రామంలో గురువారం రాత్రి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.
గడప గడపకూ నిలదీతలు
మద్య నిషేధం అమలుచేస్తామంటే ఓటేశాం...ఇప్పుడు వీధివీధికీ బెల్టు షాపు నడుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేసిన మహిళలు
రైతు భరోసా అందలేదని, మినీ గోకులం బిల్లులు రాలేదని కొందరి ఫిర్యాదు
భీమునిపట్నం (రూరల్), డిసెంబర్ 30:
మండలంలోని మజ్జిపేట గ్రామంలో గురువారం రాత్రి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. రైతు భరోసా అందలేదని కొందరు నిలదీశారు. కాగా పథకం కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారని మరికొందరు అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో మినీ గోకులం పథకం కింద షెడ్లు నిర్మించుకున్నామని, వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించడం లేదని గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మద్య నిషేధాన్ని తీసుకుని వస్తామని చెప్పడంతో ఓట్లు వేశామని ఇప్పుడు వీధి వీధికీ బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే పెన్షన్ల రద్దు గురించి కొందరు ప్రస్తావించారు. తనకు విద్యా దీవెన అందలేదని ఒక విద్యార్థి...ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది. ఇంకా కిలారి వీధిలో చేతిబోరు వేయాలని, ఇంటింటికీ కొళాయి సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. మూడేసి సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కలిగినవారు 146 మంది ఉన్నారని, వారికి ప్రభుత్వపరంగా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు. కాగా కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, మజ్జి వెంకటరావు, వార్డు సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.