మూన్నాళ్ల ముచ్చట!
ABN , First Publish Date - 2022-10-21T06:42:51+05:30 IST
అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారు. రోడ్డు నిర్మాణ పనుల్లో కనీస నాణ్యతాప్రమాణాలు పాటించలేదు.
నిర్మించిన ఏడాదికే ఛిద్రమైన గుంజువీధి రహదారి
బలపం పంచాయతీ రాళ్లగెడ్డ నుంచి మండిపల్లికి 2018లో తారు రోడ్డు మంజూరు
పీఎం సడక్ యోజన కింద రూ.1.10 కోట్లు విడుదల
మరుసటి ఏడాది పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్
2020 చివరినాటికి పూర్తి
ఏడాది తిరగకుండానే బయటపడిన నాణ్యత లోపాటు
పూర్తిగా ధ్వంసమై ఆనవాళ్లు లేని తారురోడ్డు
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్పందించాలని గిరిజనులు డిమాండ్
చింతపల్లి, అక్టోబరు 20: అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారు. రోడ్డు నిర్మాణ పనుల్లో కనీస నాణ్యతాప్రమాణాలు పాటించలేదు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. కోటి పది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏడాది కిందట నిర్మించిన తారు రోడ్డు ఆనవాళ్లు లేకుండా ఛిద్రమైంది. కనీసం మెటల్ రోడ్డుగా కూడా కనిపించకుండా బురదమయంగా మారింది. రోడ్డు దుస్థితిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పలుమారు ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో గురువారం గిరిజనులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రహదారి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు...
చింతపల్లి మండలం బలపం పంచాయతీ రాళ్లగెడ్డ నుంచి మండిపల్లి వరకు తారు రోడ్డు నిర్మించేందుకు 2018లో ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఒక కోటి 10 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. పంచాయతీ రాజ్ (ప్రాజెక్టుల విభాగం) ఇంజనీరింగ్ అధికారులు 2019 ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి కడప జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు రోడ్డు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. రాళ్లగెడ్డ మెయిన్ రోడ్డు నుంచి మండిపల్లి వరకు 2.2 కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణాన్ని 2020 చివరినాటికి పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం రహదారి నిర్మాణానికి తొలుత గ్రావెల్, మెటల్, వెట్‌మిక్స్ వేసి రోలింగ్ చేయాలి. తరువాత బీటీ (తారు మిక్చర్) వేయాలి. అయితే కాంట్రాక్టర్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. అరకొరగా మెటల్ వాడారు. వెట్ మిక్స్ అసలు వేయలేదు. కేవలం గ్రావెల్ వేసి రోలింగ్ చేసి దానిపై తారు రోడ్డు నిర్మించారు. దీంతో రహదారి నిర్మించిన ఆరు నెలలకే గోతులు ఏర్పడడం మొదలైంది. వాహనాల రాకపోకలతోపాటు గత నాలుగు నెలల నుంచి వర్షాలు కురుస్తుండడంతో నాణ్యతాలోపం పూర్తిగా బయటపడింది. తారు రోడ్డు ఆనవాళ్లు కనిపించనంతగా ఛిద్రమైంది. తారు రోడ్డు నిర్మించిన తరువాత ఐదేళ్ల వరకు ఎటువంటి మరమ్మతులకు గురైనా కాంట్రాక్టర్ సొంత నిధులతో బాగు చేయించాలన్న నిబంధన వుందని, అందువల్ల పూర్తిగా ఛిద్రమైన రోడ్డును పునర్నిర్మించాలని పలుమార్లు అధికార పార్టీ నాయకులు, పీఆర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గుంజువీధి గిరిజనులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్పందించాలి
రాళ్లగెడ్డ మెయిన్ రోడ్డు నుంచి మండిపల్లి వరకు నిర్మించిన రహదారి ఏడాదికే ఛిద్రమైందని, కోటి పది లక్షల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగంపై పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి స్పందించాలని గుంజువీధి గిరిజనులు డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించలేదని వారో ఆరోపించారు. ఉన్నతస్థాయి అధికారుల బృందంతో విచారణ చేపట్టి బాధ్యులైన కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు, క్వాలిటీ కంట్రోల్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి పూర్తిగా ఛిద్రమై, బురదమయం కావడంతో ఈ మార్గంలో సర్వీసు జీపులు, ఆటోలు, అంబులెన్సులు రావడం లేదన్నారు. దీంతో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, రోగులను డోలీలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతలోపాలపై శుక్రవారం స్పందనలో జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తామన్నారు. రహదారిని పటిష్ఠంగా పునర్నిర్మించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుంజువీధి గ్రామ పెద్దలు పాంగి రామకృష్ణ, మరియ, గెమ్మెలి రాంబాబు, కృపాసాగర్, ఇమ్మానియేలు, సోమరాజు, జోసెఫ్, ఇస్సాక్, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.