ముంచెత్తిన వాన
ABN , First Publish Date - 2022-10-07T06:03:25+05:30 IST
జిల్లాలోని అన్ని మండలాల్లో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రెండు రోజుల నుంచి ముసురు
పలు మండలాల్లో భారీ వర్షాలు
స్తంభించిన జనజీవనం
పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
నిండిన చెరువులు, జలాశయాలు
పెద్దేరు, కల్యాణపులోవ, రైవాడ గేట్లు ఎత్తివేత
శారదా, పెద్దేరు, సర్పా, వరహా నదుల్లో పెరిగిన వరద
లోతట్టు ప్రాంతాలు జలమయం
వరితోసహా అన్ని పంటలకు మేలు చేస్తుందని వ్యవసాయ అధికారులు వెల్లడి
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలోని అన్ని మండలాల్లో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నర్సీపట్నం, ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు పూర్తిగా నిండడంతో అలుగులు పారుతున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు చేరుతున్నది. కల్యాణపులోవ, పెద్దేరు రిజర్వాయర్ల నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి అదనపు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో వరహా, సర్పా, పెద్దేరు, శారదా, తాండవ, తదితర నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. గ్రామాలు, పట్టణాల్లో పలు వీధులు నీటమునిగాయి. పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చేరింది. ముసురుకాణంగా జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని వరి పంట నీటమునిగింది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా పంటలకు నష్టంవాటిల్ల లేదని అధికారులు చెప్పారు. కాగా ఇప్పటికే అధ్వానంగా వున్న రహదారులు మరింత దారుణంగా తయారయ్యాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అనకాపల్లి జిల్లా అంతటా మూడు రోజుల నుంచి ముసురు వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షాలు మొదలయ్యాయి. అదే రోజు రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు అడపాదడపా జల్లులు, భారీ వర్షం కురుస్తున్నది. ఏజెన్సీకి ఆనుకుని వున్న దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల రావికమతం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం మండలాలతోపాటు ఎలమంచిలి, మాకవరపాలెం, కశింకోట మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తామని అధికారులు చెబుతున్నారు.
నాతవరం మండలంలో చెరువులు పూర్తిగా నిండడంతో అలుగులు పారుతున్నాయి. కొండగెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాండవ రిజర్వాయర్‌లోకి 1,200 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. గరిష్ఠస్థాయికి మరో 2.5 అడుగుల మాత్రమే వుంది. ఇన్‌ఫ్లో మరింత పెరిగితే స్పిల్‌వే గేట్లు ఎత్తుతామని ప్రాజెక్టు డీఈ రాజేంద్రకుమార్ చెప్పారు.
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట సమీపంలోని గాదిగుమ్మి జలపాతం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బొడ్డేరు గెడ్డలో వరద ఉధృతి పెరిగింది. ఇంకా ధారగెడ్డ, గొర్రిగెడ్డ, పాలగెడ్డ, రాళ్ల గెడ్డ పొంగి ప్రవహిస్తున్నారు. మేజర్ పంచాయతీ ఏఎల్పురంలోని పలు వీధులు జలమయమై ఇళ్లల్లోకి నీరు చేరింది.
మాకవరపాలెం మండలంలో రెండు రోజుల నుంచి దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. డ్రైనేజీ కాలువలు పొంగి వర్షపు నీరు రోడ్లుపై ప్రవహించింది. చెరువులు పూర్తిగా నిండాయి.
నర్సీపట్నం మునిసిపాటీతోపాటు, మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి. నర్సీపట్నం మెయిన్‌రోడ్డు వర్షపు నీటితో కాలువను తలపించింది. కోటవురట్ల మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సర్పా, వరహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఎలమంచిలిలో గురువారం భారీ వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగడంతో పట్టణంలోని పలురహదారులు నీటమునిగాయి. రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రి, ఎంపీడీఓ కార్యాలయాల ఆవరణల్లో నీరు చేరింది. కాగా ఎలమంచిలికి పశ్చిమ వైపున వున్న కొండల్లో భారీ వర్షం పడడంతో వరద నీటితో శేషుగెడ్డ పొంగింది. దీంతో ఎలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వాహనాల రాకపోకలకు అవరోధం ఏర్పడింది.
పరవాడ మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. ఫార్మాసిటీలోని పలు రహదారులు చెరువును తలపించాయి. వరి పొలాల్లో నీరు సమృద్ధిగా చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్ వర్షపు నీటితో చెరువును తలపించింది. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో జాతీయ రహదారితోపాటు నర్సీపట్నం వెళ్లే రోడ్డు నీటమునిగాయి. దీంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు.
రావికమతంలో కుండపోత
అత్యధికంగా 75 మి.మీ.ల వర్షం
సబ్బవరంలో అత్యల్పంగా
జిల్లాలో అత్యధికంగా 6.5 మి.మీ.లు
నేడు కూడా భారీ వర్షాలు
అనకాపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించినట్టు జిల్లా అధికారులు చెబుతున్నారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు అత్యధికంగా రావికమతం మండలంలో 75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్ప వర్షపాతం సబ్బవరంలో 6.5 మిల్లీమీటర్లు నమోదైంది. మిగిలిన మండలాల విషయానికి వస్తే.. ఎలమంచిలిలో 59 మి.మీ.లు, కశింకోటలో 52.75, మాకవరపాలెంలో 43.5, రోలుగుంటలో 40, అచ్యుతాపురంలో 38.25, మాడుగులలో 34.05, బుచ్చెయ్యపేటలో 33, నర్సీపట్నంలో 30.75, చీడికాడలో 31, రాంబిల్లిలో 29.5, అనకాపల్లిలో 28.25, నాతవరంలో 28, పాయకరావుపేటలో 21.75, కోటవురట్లలో 21, చోడవరంలో 18, గొలుగొండలో 16.2, ఎస్.రాయవరం 16.25, మునగపాక 16.02, దేవరాపల్లి 16, నక్కపల్లి 15, పరవాడలో 14.5, కె.కోటపాడు 8.75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా వరి పైరు నాట్లు పిలక కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు దోహదపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.