జిల్లాకు కొత్తగా ఏడు ఎంఈవో పోస్టులు

ABN , First Publish Date - 2022-09-19T07:14:35+05:30 IST

జిల్లాకు కొత్తగా ఏడు మండల విద్యాశాఖాధికారి పోస్టులు మంజూరుచేశారు.

జిల్లాకు కొత్తగా ఏడు ఎంఈవో పోస్టులు

- 11 మండలాలకు 22 పోస్టులు

- సమ్మతి తెలిపిన 14 మంది పీఆర్‌ ప్రధానోపాధ్యాయులు 


విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):


జిల్లాకు కొత్తగా ఏడు మండల విద్యాశాఖాధికారి పోస్టులు మంజూరుచేశారు. విశాఖలో 11 మండలాలకు మొత్తం 22 మంది ఎంఈవోలు రానున్నారు. ఇప్పటివరకు పద్మనాభం, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాలకే ఎంఈవో పోస్టులుండగా, తాజా ఉత్తర్వులతో చినగదిలి, సీతమ్మధార, మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, గాజువాక, పెదగంట్యాడ మండలాలకు పోస్టులు మంజూరు చేశారు. దీంతో పెందుర్తి ఎంఈవోలపై పనిభారం తగ్గనుంది. జీవీఎంసీ పరిధిలోని పాఠశాలలను విద్యాశాఖ పర్యవేక్షణలోకి తేవడంతో ఇకపై వీటి పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపైనే పడింది. కాగా ఎంఈవో-1 పోస్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎంఈవో-2 పోస్టు జెడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు కేటాయించారు. ఎంఈవో పోస్టులకు హెచ్‌ఎంల సమ్మతి ప్రక్రియను ఆదివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో చేపట్టగా కేవలం 14 మంది మాత్రమే సమ్మతి తెలిపారని సమాచారం. విధులు, బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో ఎక్కువమంది ఈ పోస్టులోకి రావడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో విశాఖ పరిసరాల్లో ఉన్న హెచ్‌ఎంలు నర్సీపట్నం లేదా పాడేరు పరిసరాల మండలాలకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో కొందరు సీనియర్లు వెనుకడుగు వేశారని చెబుతున్నారు. కాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రం ఎక్కువమంది సుముఖత వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఎంఈవో జాబ్‌చార్ట్‌ వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఇమంది పైడిరాజు డిమాండ్‌ చేశారు. అలాగే ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ చేపట్టాలని కోరారు.

Read more