భక్తులకు మాస్కులు తప్పనిసరి
ABN , First Publish Date - 2022-12-31T00:28:00+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి వైకుంఠద్వార దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లా డారు.
సింహాచలం, డిసెంబరు 30 : వరాహలక్ష్మీనృసింహస్వామి వైకుంఠద్వార దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లా డారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు భక్తులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలని కోరారు. 2వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ ఉత్తర రాజగోపురంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పవేదికపై స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే స్వామివారి సర్వదర్శనాలు లభిస్తాయన్నారు. ఆ రోజు ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని, అంతరాలయంలో ప్రత్యేక హోదా కలిగిన ప్రముఖులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. భక్తులకు తాగునీటితోపాటు పిల్లలకు పాలు, బిస్కట్లు సరఫరా చేయాలని నిర్ణయించామని చెప్పారు. అదే రోజు తెల్లవారుజామున 3 గంటలకు సింహగిరి మెట్లపై దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. కాగా ఏకాదశి సందర్భంగా సింహగిరిపై ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన విధి విధానాలపై దేవాలయ, పోలీసు అధికారులు శుక్రవారం ట్రాఫిక్ ఏడీసీపీ ఎస్. అరిఫుల్లా నేతృత్వంలో క్షేత్ర పరిశీలన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున కొండదిగువ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీదేవి సత్రం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఏడీసీపి సూచించారు. ప్రముఖుల కార్లను మాత్రమే సింహగిరిపైకి అనుమతించి, భక్తుల వాహనాలను అనుమతించరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కుమారస్వామి, గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.