మరణ మృదంగం

ABN , First Publish Date - 2022-09-19T06:36:12+05:30 IST

జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హుకుంపేట మండలంలో గత కొన్ని రోజులుగా శిశు మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

మరణ మృదంగం
గతవారం తాడిపుట్టు పంచాయతీ గుడుగుపల్లి గ్రామంలో మృతి చెందిన శిశువులు(ఫైల్‌)

- హుకుంపేటలో ఆగని శిశు మరణాలు 

- పది నెలల వ్యవధిలో 20 మంది శిశువులు, చిన్నారులు మృతి 

- వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ అధికారుల నిర్లిప్తత

- కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌ 

- మన్యంలో వైద్య సేవలు అంతంత మాత్రమే..


                                     (ఆంధ్రజ్యోతి- పాడేరు/హుకుంపేట)

జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హుకుంపేట మండలంలో గత కొన్ని రోజులుగా శిశు మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వరుస శిశు మరణాలతో అక్కడ వైద్య, ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్‌ సేవల డొల్లతనం తేటతెల్లమవుతున్నది. గత పది నెలల్లో హుకుంపేట మండలంలో సుమారుగా 20 మంది శిశువులు మృతి చెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

----

హుకుంపేట మండలంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. గత బుధవారం ఈ మండలం గడికించుమండ పంచాయతీ కేంద్రానికి చెందిన పాంగి మణిదీప్‌ అనే ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. వాస్తవానికి ఆ బాలుడిని హుకుంపేట ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించినప్పటికీ మృతి చెందడంతో తల్లిదండ్రులు రామలక్ష్మి, శివ కన్నీరుమున్నీరవుతున్నారు. హుకుంపేట మండల కేంద్రంలోనే గత నాలుగు నెలల క్రితం ముగ్గురు శిశువులు మృతి చెందగా, అంతకు ముందు ఒంటిపాకలో ఒక శిశువు, సూకూరు గ్రామంలో ఐదుగురు, డి.చింతలవీధి, భీమవరం, బారాపల్లి, చీడిపుట్టు గ్రామాల్లో ఒక్కొక్కరు చొప్పున, తాడిపుట్టు పంచాయతీ పరిధిలో ఆరుగురు వరకు శిశువులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు గడుగుపల్లి గ్రామంలో గత వారం మృతి చెందిన వారే కావడం విశేషం. ఇలా మండలంలో గత పది నెలల వ్యవధిలో 20 మంది పైబడి శిశువులు, చిన్నారులు మృతి చెందారని బాధిత గిరిజనులు తెలిపారు. ఇక మారుమూల ప్రాంతాల్లోని శిశు మరణాలు బాహ్యప్రపంచానికి తెలియని పరిస్థితి నెలకొంది. అయితే హుకుంపేట మండలంలోని శిశు మరణాలను అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే అవి పునరావృతమవుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 

సేవల్లో లోపం.. గర్భంలోనే సమస్యలకు బీజం

ఏజెన్సీలో శిశు మరణాలకు తల్లి గర్భంలోనే బీజం పడుతుందనేది వాస్తవం. మహిళ గర్భం దాల్చిన మూడో నెల నుంచే ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేసుకోవడంతోపాటు, గర్భంలోని పిండం సక్రమంగా ఎదిగేందుకు అవసరమైన మందులు, పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. గిరిజనులకు వాటిపై అవగాహన లేకపోవడంతోపాటు పేదరికంతో జీవిస్తుండడంతో గర్భిణులు ప్రత్యేకంగా పౌష్టికాహారం తీసుకునే అవకాశం లేకుండా పోతుంది. దీంతో గర్భంలోని శిశువు ఎదుగుదలపై దాని ప్రభావం పడడంతో సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం గిరిజన తల్లులకు లేకుండా పోతున్నది. దీనికి తోడు ఏజెన్సీలో వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ సేవలు అంతంతమాత్రంగా ఉండడంతో గర్భిణులకు ఆశించిన స్థాయిలో వైద్యం, పోషకాహారం అందకపోవడంతోనే శిశు మరణాలు ఆగడం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కలెక్టర్‌ ఆదేశాలు భేఖాతర్‌

ఈ ఏడాది జూలై నెలలో ఏజెన్సీలో పెదబయలు మండలం రూడకోట, హుకుంపేట మండలం సూకూరు ప్రాంతాల్లో శిశు మరణాలు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్పందించారు. వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మన్యంలో మాతా శిశు మరణాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ అధికారులు కలెక్టర్‌ ఆదేశాలను ఖాతరు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా మన్యంలో నిత్యం ఏదో చోట శిశు మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే శిశు మరణాల జరిగినప్పుడు వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ అధికారులు హడావుడి చేసి, ఆ శిశువుల మృతికి తమ వైఫల్యం కాదని అధికారికంగా విచారణ నివేదికలు సమర్పిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో శిశు మరణాలను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోగా, వాటిని సీరియస్‌గా తీసుకోని పరిస్థితి కొనసాగుతున్నది. దీని వల్ల మన్యంలో శిశు మరణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. వాస్తవానికి గిరిజన ప్రాంతంలో వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ సేవలు పటిష్ఠం కానంత వరకు మాతా శిశు మరణాలు జరుగుతూనే ఉంటాయి. 



Updated Date - 2022-09-19T06:36:12+05:30 IST