మెయిన్స్‌లో మెరిశారు

ABN , First Publish Date - 2022-08-09T07:16:32+05:30 IST

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో విశాఖ జిల్లాకు చెందిన, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మంచి ప్రతిభచూపారు.

మెయిన్స్‌లో మెరిశారు

జేఈఈలో విశాఖపట్నం విద్యార్థుల ప్రతిభ

ముగ్గురికి 100 పర్సంటైల్‌ 

ఓబీసీ, ఎస్సీ కేటగిరీల్లో మొదటి ర్యాంకులు

జనరల్‌ కేటగిరీలో 7, 9, 22, 25, 44, 48, 93....

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో విశాఖ జిల్లాకు చెందిన, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మంచి ప్రతిభచూపారు. గత నెల చివరిలో నిర్వహించిన జేఈఈ సెకండ్‌ సెషన్‌ ఫలితాల్లో నగరంలో చదువుకున్న మెండ హిమవంశీ, పల్లి జలజాక్షి, కొయ్యాన సుహాస్‌ 100 పర్సంటైల్‌ సాధించారు. జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్‌ సాధించిన 24 మందిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదుగురు ఉండగా...వారిలో ముగ్గురు విశాఖపట్నంలోని శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ విద్యార్థులు. అయితే ఈ ముగ్గురు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. జూన్‌లో నిర్వహించిన జేఈఈ తొలి సెషన్‌లో కూడా కొయ్యాన సుహాస్‌ 100 పర్సంటైల్‌ సాధించాడు. కాగా జూన్‌, జూలైలో నిర్వహించిన రెండు సెషన్ల పరీక్షలను పరిగణనలోకి తీసుకుని జాతీయ స్థాయిలో ర్యాంకులు ప్రకటించారు. ఓబీసీ కేటగిరీలో...హిమవంశీ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు (జనరల్‌ కేటగిరీలో ఏడో ర్యాంకు), పల్లి జలజాక్షి రెండో ర్యాంకు (జనరల్‌ కేటగిరీలో తొమ్మిదో ర్యాంకు), కె.సుహాస్‌ నాలుగో ర్యాంకు (జనరల్‌ కేటగిరీలో 22వ ర్యాంకు), చైతన్యసాయి తేజ ఎనిమిదో ర్యాంకు (జనరల్‌ కేటగిరీలో 48వ ర్యాంకు), ఎస్సీ కేటగిరీలో నగరంలోని సీతమ్మధారకు చెందిన డి.జాన్‌ జోసెఫ్‌ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు (జనరల్‌ కేటగిరీలో 82వ ర్యాంకు) సాధించారు. ఇంకా జనరల్‌ కేటగిరీలో...డి.శరణ్య 25, బి.సిరి 44, వి.గణేష్‌మహేష్‌ 93, కొణతాల రష్మిత 186, జి.సాయిశశాంక్‌ 281, పి.సాయి ఆదర్శ (గాజువాక) 292, బైరి సిద్ధార్థరాయ్‌ 309, రెడ్డి జోగీందర్‌సాయి 312, జి.యశ్వంత్‌ వెంకటరమణ (ఉక్కునగరం) 359 ర్యాంకు, ద్వారకానగర్‌కు చెందిన సీహెచ్‌ అభిజిత్‌ 404, సుజాత్‌నగర్‌కు చెందిన మహాదాసు మాధవరాజ్‌ 495, షీలానగర్‌కు చెందిన అమరాపు అనూప్‌ 525 ర్యాంకు సాధించారు.  సాధించారు. నగరంలో మరికొన్ని విద్యా సంస్థల విద్యార్థులు 1000లోపు ర్యాంకులు సాధించారు. 


కంప్యూటర్‌ రంగ మార్పుల్లో భాగస్వామినవుతా

ఎస్సీ కేటగిరీలో మొదటి ర్యాంకర్‌ జోసఫ్‌

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కంప్యూటర్స్‌ రంగంలో భవిష్యత్తులో చోటుచేసుకునే కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామిగా వుండాలన్నదే తన లక్ష్యమని జేఈఈ మెయిన్స్‌లో ఎస్సీ కేటగిరీలో మొదటి ర్యాంకు (జనరల్‌ కేటగిరీలో 82వ ర్యాంకు) సాధించిన డి.జాన్‌జోసెఫ్‌ పేర్కొన్నాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో చేరి తరువాత పరిశోధన రంగంలో అడుగుపెడతానన్నాడు. జోసెప్‌ తండ్రి విల్సన్‌ ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఏజీఎంగా పనిచేస్తుండగా, తల్లి జోషి రత్నం గృహిణి. ఆరో తరగతి వరకు కర్ణాటకలో...ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆనందపురం సమీపంలోని కేకేఆర్‌ గౌతమ్‌ స్కూలులో, ఇంటర్‌ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీలో చదువుకున్నాడు. కుటుంబ సభ్యులు, అకాడమీలో అధ్యాపకుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించానన్నాడు.

Updated Date - 2022-08-09T07:16:32+05:30 IST