మానసిక ఆస్పత్రిలో మాయాజాలం

ABN , First Publish Date - 2022-10-08T05:27:57+05:30 IST

ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌లుగా చేరే రోగులు ఆస్పత్రికి చెల్లించే ఫీజులను అడ్డగోలుగా బుక్కేశాడు ఒక ఉద్యోగి. నెలలు తరబడి సాగిన ఈ దోపిడీలో రూ.లక్షలు దోచేశాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు అక్రమాలకు దిగి రూ.లక్షలను వెనకేశాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందినా ఉన్నతాధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకున్నారు.

మానసిక ఆస్పత్రిలో మాయాజాలం
విశాఖలోని పభుత్వ మానసిక ఆస్పత్రి

సిబ్బంది నిధుల దుర్వినియోగం   

గతంలోనూ రెండు సార్లు ఇదే తీరు 

ఫిర్యాదులపై తూతూమంత్రం చర్యలు 

ఉద్యోగుల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలో మరో ఉద్యోగి ఇబ్బందులు

డబ్బులు ఇస్తేనేగానీ పని చేయని వైనం 

వీరిద్దరిపై చర్యలు తీసుకున్న సూపరింటెండెంట్‌

డీఎంహెచ్‌వోకు సరెండర్‌.. నెల తిరగకముందే తిరిగి విధుల్లోకి 

 పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ ఫిర్యాదు 

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి) 

ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌లుగా చేరే రోగులు ఆస్పత్రికి చెల్లించే ఫీజులను అడ్డగోలుగా బుక్కేశాడు ఒక ఉద్యోగి. నెలలు తరబడి సాగిన ఈ దోపిడీలో రూ.లక్షలు దోచేశాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు అక్రమాలకు దిగి రూ.లక్షలను వెనకేశాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందినా ఉన్నతాధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకున్నారు. కాగా మరో ఉద్యోగి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్‌ పొందకుండా ఇబ్బందులకు గురిచేయడంతోపాటు ప్రతి పనికీ ఓ రేటును పెట్టి మరీ వసూళ్లకు పాల్పడు తున్నాడు. ఈ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకో వాలంటూ గత నెలలో అప్పటి సూపరింటెండెంట్‌ రిక్రూట్‌మెంట్‌ అఽథారిటీ డీఎంహెచ్‌వోకు సరెండర్‌ చేశారు. అయితే, సదరు ఉద్యోగులను సరెండర్‌ చేసి నెల రోజులు దాటకముందే తిరిగి వారిద్దరూ విధుల్లో చేరడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. 

ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో క్లర్క్‌ కమ్‌ టెలీఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వై.అశోక్‌కుమార్‌ ఆస్పత్రికి దక్కాల్సిన నిధులను కొన్నేళ్లుగా దుర్వినియోగం చేస్తు న్నారు. ఇన్‌పేషెంట్‌లుగా చేరే రోగులు రోజుకు కొంత మొత్తం చొప్పున ఆస్పత్రికి చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక రోగి ఆస్పత్రిలో చికిత్స పొందిన కాలానికిగాను రోజుకు కొంత మొత్తం చొప్పున రెండు వేలు చెల్లిస్తే.. ఈ ఉద్యోగి ఇక్కడే తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. రోగికి చెల్లించే రశీదులో మొత్తాన్ని తీసుకున్నట్టు ఇవ్వ గా, ఆస్పత్రికి అందించే రశీదులో మాత్రం రూ.200గా చూపించేవాడు. ఈ విధంగా ప్రతిరోజూ వేలాది రూ పాయల ఆస్పత్రి నిధులను దుర్వినియోగం చేశాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన అధికారులు వాస్తవమేనని నిర్ధారించారు. దుర్వి నియోగం చేసిన మొత్తం డబ్బులు తీసుకువచ్చి చెల్లిం చాలని అప్పటి సూపరింటెండెంట్‌ ఆదేశించడంతో డబ్బులు చెల్లించాడు. దీంతో సదరు ఉద్యోగిపై అప్పటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే, బుద్ధి మార్చుకోని సదరు ఉద్యోగి యథావిధిగా తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. దీనిపైనా ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన అధికారులు వాస్తమేనని నిర్ధారించారు. అయితే, ఈసారి అధికారులు అతనిపై మరింత సానుభూతిని చూపించారు. ఒకేసారి వసూ లు చేయకుండా, జీతంలో నుంచి నెల నెల కొంత మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని కల్పించారు. రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేలా చిన్నపాటి చర్యను తీసుకుని వదిలేశారు. నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి నుంచి ఒకేసారి మొత్తాన్ని వసూలు చేయ కుండా నెలవారీ చెల్లించేలా అవకాశం కల్పించడం, పోలీసులకు, ఏసీబీకి ఫిర్యాదు చేయకపోవడంపై ఫిర్యా దులు వచ్చాయి. దీంతో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలంటూ గత నెలలో రిక్రూట్‌మెంట్‌ అథారిటీ  డీఎంహెచ్‌వోకు సూపరింటెండెంట్‌ సరెండర్‌ చేశారు. 


ఉద్యోగులపై వేధింపులు.. 

ఆస్పత్రిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మరో ఉద్యోగి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుండడంతో అతనిపైనా చర్యలు తీసుకోవాలంటూ అప్పటి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శత్పతి డీఎంహెచ్‌వోకు సరెండర్‌ చేశారు. ఇన్సురెన్స్‌ పత్రాలు అందించకుండా, పదవీ విరమణ ప్రయోజ నాలు పొందేందుకు కావాల్సిన పత్రాలు అందించేం దుకు డబ్బులు డిమాండ్‌ చేయడంపై పలువురు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు 21 మంది ఉద్యోగుల్లో ముగ్గురివి మాత్రమే క్లియర్‌ చేసిన  జూనియర్‌ అసిస్టెంట్‌ మరో 18 మందిని నాలుగేళ్లుగా తిప్పుతున్నారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన సూప రింటెండెంట్‌ వారి ఫైళ్లను క్లియర్‌ చేయాలని ఆదేశించడంతోపాటు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలం టూ డీఎంహెచ్‌వోకు సరెండర్‌ చేశారు. 


విధుల్లోకి చేరడంపై ఫిర్యాదు.. 

ఆస్పత్రి నిధులు దుర్వినియోగంతోపాటు విశ్రాంత ఉద్యోగులు నుంచి డబ్బు వసూలుచేస్తున్న ఇద్దరు ఉ ద్యోగులను సరెండర్‌ చేసి నెల గడవక ముందే విధుల్లో చేరడంపై రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌(అప్పటి సూపరింటెండెంట్‌) సీఎంకు, ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్‌, ఇతర ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-10-08T05:27:57+05:30 IST