బండ బాదుడు

ABN , First Publish Date - 2022-03-23T06:11:35+05:30 IST

ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో వంట గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం రూ.50 పెంచేసింది.

బండ బాదుడు

వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంపు

జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.3.5 కోట్లు అదనపు భారం

రాయితీ మాత్రం ఆ మూడు రూపాయలే

సామాన్య, మధ్య తరగతి గగ్గోలు

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు కూడా పెరుగుదల

పెరగనున్న అన్ని రకాల వస్తువుల ధరలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో వంట గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం రూ.50 పెంచేసింది. సాధారణంగా ఆయిల్‌ కంపెనీలు వంట గ్యాస్‌ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన లేదంటే 15వ తేదీన మాత్రమే సవరించాల్సి ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలైతే ఏ రోజుకు ఆరోజే మారిపోతుంటాయి. కానీ ఈసారి వంట గ్యాస్‌ ధరలు అటు..ఇటు కాకుండా మధ్యలో 22వ తేదీన పెంచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పెంపుదల ఇక్కడతో ఆగదని, మళ్లీ ఒకటో తేదీన పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో రూ.10, రూ.20 కాకుండా ఒకేసారి సిలిండర్‌పై రూ.50 పెంచడం ఆయిల్‌ కంపెనీలు అలవాటు చేసుకున్నాయి.

కేంద్రం ప్రకటనతో విశాఖపట్నంలో సోమవారం రూ.908గా వున్న 14.2 కిలోల సిలిండర్‌ ధర మంగళవారం రూ.958కి చేరింది. డెలివరీ బాయ్‌ డిమాండ్‌ చేసే టిప్‌తో కలుపుకొంటే సిలిండర్‌కి అయ్యే వ్యయం నికరంగా వెయ్యి రూపాయలు. ప్రభుత్వం అందులో ఇచ్చే రాయితీ కేవలం మూడు రూపాయలే. గతంలో ధర ఎంత పెరిగినా ఆ భారం వినియోగదారులపై పడకుండా రాయితీ రూపంలో వెనక్కి ఇచ్చేవారు. గత రెండేళ్లుగా రాయితీని పూర్తిగా తగ్గించేశారు.


జిల్లాలో 13 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు

విశాఖపట్నం జిల్లాలో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, తదితర కంపెనీలన్నీ కలిసి 12,98,486 వంట గ్యాస్‌ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. అందులో ప్రతి నెలా సిలిండర్‌ తీసుకునేవారి సంఖ్య ఏడు లక్షల వరకూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మూడు, నాలుగు నెలలకు ఒక సిలిండర్‌  వాడుకుంటుంటారు. రెగ్యులర్‌గా సిలిండర్‌ వినియోగించే వారిపై ఇప్పుడు పెంచిన రూ.50 వల్ల నెలకు రూ.3.5 కోట్ల భారం పడుతోంది. ఇది ఇక్కడితో ఆగదు. గ్యాస్‌ వినియోగించే వ్యాపార సంస్థలన్నీ పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌ ధర కూడా పెరిగిందని, రవాణా చార్జీలు అధికం అయ్యాయని, వారి ఉత్పత్తుల రేట్లు పెంచేస్తాయి. ఆ భారం కూడా వినియోగదారులే భరించాల్సి ఉంది. ఇప్పటికే చాలా హోటళ్లలో వంట నూనెల ధరలు పెరగడం వల్ల రేట్లు పెంచాల్సి వచ్చిందని బోర్డులు పెడుతున్నారు. ఇప్పుడు వాటికి గ్యాస్‌ ధరలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. 


పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా...

ఒక్క వంట గ్యాస్‌ మాత్రమే కాకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా మంగళవారం పెంచేశారు. పెట్రోల్‌పై లీటరుకు 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచారు. జిల్లాలో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌...కంపెనీలకు 258 బంకులు ఉన్నాయి. ఒక్కో బంకులో రోజుకు సగటున పెట్రోల్‌, డీజిల్‌ కలిపి ఐదు వేల లీటర్ల వరకు విక్రయిస్తున్నారు.   


జిల్లాలో 15 లక్షల వాహనాలు

విశాఖపట్నం నగరంలో 12 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 3 లక్షలు కలిపి జిల్లాలో మొత్తం 15 లక్షల వాహనాలు ఉన్నాయి. అచ్చంగా ద్విచక్ర వాహనాలే 14 లక్షలు వుంటాయని అంచనా. ద్విచక్ర వాహనాల్లో రోజుకు సగటున అర లీటరు పెట్రోల్‌ వాడినా ప్రతి రోజూ ఏడు లక్షల పెట్రోల్‌ వినియోగమవుతుంది. అంటే లీటరు పెట్రోల్‌ ధర 88 పైసలు పెంచడం వల్ల వినియోగదారులపై రోజుకు రూ.6.16 లక్షల అదనపు భారం పడుతోంది. జిల్లాలో ఆటోల సంఖ్య 45 వేలు. ఇవి రోజుకు 10 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తాయని అనుకుంటే 4.5 లక్షల లీటర్లకు 85 పైసలు చొప్పున సుమారు నాలుగు లక్షల రూపాయల భారం పడుతోంది. ద్విచక్ర వాహనదారులు, ఆటోలకు కలిపి రోజుకు రూ.పది లక్షలకుపైగా భారం పడుతోంది. 


మధ్య తరగతి ఎలా బతకాలి?

బెహరా అనురాధాదేవి, మధురవాడ

వంట నూనెలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో గ్యాస్‌ ధర కూడా పెంచడంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అయ్యింది. ఇలా ధరలు పెంచుకుంటూ వెళితే మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలి?. వంట గ్యాస్‌కు గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. 


పేదలపై మోయలేని భారం

సింగంపల్లి వెంకటలక్ష్మి, బలిఘట్టం, నర్సీపట్నం మునిసిపాలిటీ

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరను తరచూ పెంచేస్తూ పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నది. రెండేళ్ల క్రితం సిలిండర్‌ ధర రూ.600 వుండగా, ఇప్పుడు రూ.966కు పెరిగింది. సిలిండర్‌ డెలివరీ బాయ్‌కి ఇచ్చే డబ్బులతో కలిపితే రూ.1,000 అవుతుంది. విపరీతంగా పెరిగిన వంట నూనె, నిత్యావసరాల ధరలతో సతమతం అవుతున్న తరుణంలో వంట గ్యాస్‌ ధర పెంచడం దారుణం.


సామాన్యులపై పెనుభారం

అక్కిరెడ్డి రమణ, గోపాలపట్నం

ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గ్యాస్‌ ధర పెరగడం వల్ల మరింత భారం పెరుగుతుంది. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్‌ ధరలు పెరగడం వల్ల నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులకు తగిన ఆదాయం లేకపోవడంతో సామాన్యులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. 


గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎలా పెరిగిందంటే...?

సంవత్సరం/నెల ధర

2020 జూన్‌       రూ.600

2020 నవంబరు రూ.620

2020 డిసెంబరు రూ.702

2021 ఫిబ్రవరి రూ.727

2021 మే రూ.830

2021 జూన్‌       రూ.817

2021 జూలై  రూ.843

2021 సెప్టెంబరు   రూ.893

2022 జనవరి  రూ.908

2022 మార్చి 22  రూ.958


పాత ధర  కొత్త ధర 

పెట్రోల్‌  రూ.109.03  రూ.109.91

డీజిల్‌  రూ.95.17  రూ.96

Read more