తుఫాన్‌ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2022-09-11T06:10:18+05:30 IST

మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది.

తుఫాన్‌ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం
లచ్చన్నపాలెంలో నిలిచిన వర్షపు నీటిని మోటారుతో తోడిస్తున్న దృశ్యం వర్షంతో పాట్లు


డ్రైనేజీలు పారక నిలిచిన నీరు

నీటిని తొలగించేందుకు అవస్థలు పడిన ప్రజానీకం

మాకవరపాలెం, సెప్టెంబరు 10: మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మరోపక్క రోడ్డు పక్కన ఉన్న కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే పారుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లచ్చన్నపాలెంలో సిమెంట్‌ రోడ్లు వేసి కాలువలు నిర్మించకపోవడంతో వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తామరంలోని మురుగునీరు పారే మదుములు కప్పివేయడంతో నీరంతా మెయిన్‌ రోడ్డుపైన పారుతుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  గ్రామాల్లో మట్టి రోడ్లు బురదమయంగా మారాయి.

ఏటిగైరంపేటలో ఇళ్లలోకి వర్షపు నీరు

గొలుగొండ: మండలంలోని ఏటిగైరంపేట గ్రామంలో వర్షపు నీరు డ్రైనేజీలు పారక ఇళ్ల మధ్య నిలిచిపోయింది. దీంతో ప్రజల ఆ నీటిని బయటకు పంపేందుకు అవస్థలు పడుతున్నారు. మండలంలో శనివారం చీడిగుమ్మల, పాకలపాడు, ఏటిగైరంపేట, రావణాపల్లి, జోగంపేట, పాతమల్లంపేట గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఏటిగైరంపేటలో రామాలయం వీధిలో డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడంతోపాటు గ్రామంలోని నీరు వెళ్లకుండా కాలువలకు అడ్డంగా భూమి ఎత్తుచేయడంతో నిలిచిపోయింది. గ్రామంలో రామాలయం వీధిలో గల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Updated Date - 2022-09-11T06:10:18+05:30 IST