కుంభవృష్టి

ABN , First Publish Date - 2022-10-07T06:01:48+05:30 IST

పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన్యంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వాన కురుస్తున్నది.

కుంభవృష్టి
అనంతగిరి మండలం తైడా సమీపంలో రహదారిపై కూలిన చెట్టు

- మన్యంలో ఎడతెరిపి లేకుండా వాన

- రహదారులు జలమయం

- పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు

- అనంతగిరి మండలంలో అత్యధిక వర్షపాతం

- తైడా సమీపంలో రోడ్డుపై కూలిన చెట్టు 


మన్యంలో గురువారం భారీ వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగి ప్రవహించాయి. అనంతగిరి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తైడా సమీపంలో ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

పాడేరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన్యంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వాన కురుస్తున్నది. గురువారం సైతం ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.  పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మంగళవారం నుంచి ముసురు వాతావరణం కొనసాగుతుండడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడుతున్నది. బుధవా రం రాత్రి నుంచి ఏకధాటిగా కుండపోత వాన కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. గెడ్డలు, వాగులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. 

అనంతగిరి మండలంలో అత్యధికం

ఏజెన్సీలో అనంతగిరి మండలంలో గురువారం అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ మండలంలో 75.5 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదుకాగా, అత్యల్పంగా ముంచంగిపుట్టు మండలంలో 2.8 మిల్లీమీటర్లు నమోదైంది. కొయ్యూరులో 44, జీకేవీధిలో 34.6, అరకులోయలో 29.2, హుకుంపేటలో 24.9, పాడేరులో 24.1, చింతపల్లిలో 21.1, డుంబ్రిగుడలో 18.9, పెదబయలులో 17.5, జి.మాడుగులలో 14.4 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదైంది. 

చింతపల్లిలో..

చింతపల్లి: మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీని వల్ల  జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.  లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు వర్షపు నీటితో నిండిపోయాయి.  లంబసింగి వారపు సంతలో వినియోగదారులు, వర్తకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తులపాడు గెడ్డ పొంగి రహదారి పైనుంచి ప్రవహిస్తున్నది. 

 అరకులోయలో..

అరకులోయ: మండలంలో రెండు రోజులుగా వర్షం కొనసాగుతోంది. గురువారం కూడా వాన కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. ఆ తరువాత జల్లులు కొనసాగుతున్నాయి. 

 అనంతగిరిలో..

అనంతగిరి: మండలంలో బుధ, గురువారాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా రాత్రి పగలు వర్షం కురవడంతో మండలంలోని రహదారులు ఛిద్రమయ్యాయి. అనంతగిరి- ఎస్‌కోట ఘాట్‌రోడ్డులో వరదనీరు రహదారి పైనుంచి ప్రవహించింది. తైడా సమీపంలో ఓ చెట్టు రహదారికి అడ్డంగా కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. అదే విధంగా పలుచోట్ల బండరాళ్లు రహదారిపైకి వచ్చాయి. నిమ్మలపాడు నుంచి కుంబర్తి మీదుగా లుంగపర్తి రహదారి నిర్మాణ దశలో ఉండగా, పలుచోట్ల మట్టిపెళ్లలు జారిపడి రహదారిపైకి వచ్చాయి. దీని వల్ల ఆ ప్రాంత వాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒనుకొండ, జీలుగులుపాడు, పసిని, రామచంద్రాపురం గెడ్డ ఆవలి గ్రామాల వాసులు బాహ్యప్రపంచానికి దూరమయ్యారు. ఏకధాటి వర్షంతో స్థానికులు ఆందోళన  చెందుతున్నారు.

పొంగి ప్రవహిస్తున్న నదులు 

అనంతగిరి రూరల్‌: మండలంలో గత రెండు రోజులుగా భారీ వర్షం పడడంతో గోస్తనీ, చంపావతి, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  కొండల పైనుంచి భారీగా వరద నీరు నదుల్లోకి చేరడంతో గోస్తనీ, చంపావతి ప్రవాహ ఉధృతి పెరిగింది. కాశీపట్నం వద్ద  గోస్తనీ ప్రవాహం పెరిగింది. దీంతో సారవానిపాలెం, దబ్బలపాడు, మెట్టుపాలెం గ్రామస్థులు గెడ్డలు దాటలేక ఇళ్లకే పరిమితమయ్యారు. చంపావతి నది ప్రవాహం పెరిగి ఆండ్ర- గరుగుబిల్లి రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. 

ముంచంగిపుట్టులో..  

ముంచంగిపుట్టు: మండల పరిధిలో గురువారం వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దఫ దఫాలుగా ఒక మోస్తరు వర్షం పడింది. ప్రధాన రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. 

పెదబయలులో..

పెదబయలు: మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. రహదారులు బురదమయమయ్యాయి.

Updated Date - 2022-10-07T06:01:48+05:30 IST