కదంతొక్కిన కార్మికులు

ABN , First Publish Date - 2022-09-21T06:21:28+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం జిల్లా కేంద్రానికి తరలివచ్చారు.

కదంతొక్కిన కార్మికులు
కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు యత్నిస్తున్న ఆందోళనకారులను లాఠీలతో నెట్టివేస్తున్న పోలీసులు

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ వద్ద ఆందోళన


అనకాపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం జిల్లా కేంద్రానికి తరలివచ్చారు.  జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేశారు. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.  ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయం కల్పించాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. కలెక్టరు వచ్చి తమ సమస్యలను వినాలని కార్మికులు పట్టుబట్టారు. మధ్యాహ్నం ఒంటగంటన్నర  వరకు అధికారులు ఎవరూ రాకపోవడంతో కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు లాఠీలతో నెట్టడంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి.  ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి కుడిచెయ్యికి గాయమవడంతో రక్తం కారింది. విషయం తెలుసుకున్న జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ ఆందోళనకారుల వద్దకు వచ్చి వారి సమస్యలు విని, అనంతరం వినతిపత్రం స్వీకరించారు. చర్యల కోసం కొంతమంది నాయకులను జేసీ కల్పన కుమారి వద్దకు పంపారు. కార్మికుల సమస్యలు, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆమె హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుత్తల శంకరరావు, కార్యదర్శులు ఆర్‌.రాము, గనిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి బీవీ శ్రీనివాసరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి, ఆశ వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సత్యవతి, మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు బి.వరలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు తరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more