కారడవిలో నరకయాతన

ABN , First Publish Date - 2022-10-07T06:00:23+05:30 IST

అసలే వర్షం.. ఆపై చలిగాలులు.. దీనికి తోడు చీకటి.. ఆ సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు పీటీడీ(ప్రజా రవాణా శాఖ) బస్సులు ఢీకొని రెండు గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.

కారడవిలో నరకయాతన
ఇద్దరు డ్రైవర్లు వాదించుకుంటున్న దృశ్యం

- ఎదురెదురుగా ఢీకొన్న రెండు పీటీడీ బస్సులు 

- డ్రైవర్ల వాగ్వాదంతో రెండు గంటల పాటు నిలిపివేత

- ఆ తరువాత డీజిల్‌ లేక చింతపల్లి సమీపంలో ఆగిపోయిన విశాఖ వెళ్లే బస్సు 

- చీకట్లో చలిగాలులకు అల్లాడిన ప్రయాణికులు 


సీలేరు, అక్టోబరు 6: అసలే వర్షం.. ఆపై చలిగాలులు.. దీనికి తోడు చీకటి.. ఆ సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు పీటీడీ(ప్రజా రవాణా శాఖ) బస్సులు ఢీకొని రెండు గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఆందోళన చెందారు. ఈ ఘటన సప్పర్ల ఘాట్‌ రోడ్డులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 

---

విశాఖపట్నం మద్దిలపాలెం డిపోకు చెందిన విశాఖపట్నం- భద్రాచలం, అలాగే భద్రాచలం - విశాఖపట్నం పీటీడీ నైట్‌ సర్వీసు బస్సులు సప్పర్ల ఘాట్‌ రోడ్డులో మంగళవారం రాత్రి ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. దీంతో ఆ ఇద్దరు డ్రైవర్లు తప్పు నీదంటే నీదని వాగ్వాదానికి దిగి సుమారు రెండు గంటల సేపు బస్సులను నిలిపివేశారు. అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం ఆ సమయంలో వర్షం, చలిగాలుల తీవ్రంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ గొడవ సమసిన తరువాత రెండు బస్సులు బయలుదేరాయి. అయితే భద్రాచలం నుంచి విశాఖ వెళుతున్న బస్సు డీజిల్‌ లేని కారణంగా చింతపల్లికి ఐదు కిలోమీటర్లు దూరంలో పెంటపాడు గ్రామం ఘాట్‌ రోడ్డు వద్ద ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు వర్షంతో పాటు చలిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తాము రాత్రంతా నరకం చవిచూశామని ప్రయాణికులు వాపోయారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2022-10-07T06:00:23+05:30 IST