జోరువాన

ABN , First Publish Date - 2022-09-19T06:34:52+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన్యంలో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి.

జోరువాన
ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి వెళ్లే మార్గంలో వర్షపు నీరు

- ముంచంగిపుట్టు, అనంతగిరిలో భారీ వర్షం

- మిగతా చోట్ల ఓ మోస్తరుగా..

- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావమే కారణం


పాడేరు, సెప్టెంబరు 18:(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన్యంలో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పాడేరు సహా ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు మండలంలో భారీ వర్షం కురిసింది. పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల్లో ఒక మోస్తరుగా, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధిలో జల్లులతో కూడిన వర్షం పడింది. ఏజెన్సీలో కొయ్యూరు మినహా అన్ని మండలాల్లోనూ వర్షం పడింది. మంగళవారం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త సందీప్‌నాయక్‌ తెలిపారు. 

ముంచంగిపుట్టులో...  

ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం పడింది. స్థానిక నాలుగు రోడ్ల కూడలి ప్రధాన రహదారి, సీహెచ్‌సీకి వెళ్లే సీసీ రోడ్డు పైనుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లక్ష్మీపురం, బరడ, బూసిపుట్టు, బుంగాపుట్టు తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. పల్లపు ప్రాంతంలోని వరి పంట పొలాలు పలు చోట్ల నీట మునిగాయి.  పంట పొలాల్లోకి మట్టి దిబ్బలు వచ్చి చేరడంతో  పలు చోట్ల పంట దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించడం, ప్రధాన మట్టి రోడ్లు బురదమయంగా మారడంతో అటుగా వాహన రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. 

అనంతగిరిలో..

అనంతగిరి: మండల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. సాయంత్రానికి తగ్గుముఖం పట్టినప్పటికీ  ముసురు  వాతావరణం నెలకొంది. అనంతగిరి,  బొర్రా, డముకు, కాశీపట్నం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన వర్షాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Read more