ఉద్యోగ అనుభవాలు ఎంతో నేర్పాయి

ABN , First Publish Date - 2022-09-27T06:46:52+05:30 IST

ఉద్యోగ అనుభవాలు సినీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని సినీ నటుడు వి.సత్యసాయి శ్రీనివాస్‌ తెలిపారు.

ఉద్యోగ అనుభవాలు ఎంతో నేర్పాయి
సత్యసాయి శ్రీనివాస్‌

సినీ జీవితానికి అవే దోహదం

ఇప్పటి వరకు 44 సినిమాల్లో నటించా..

మన్యం అందాలు అద్భుతం

సినీ నటుడు సత్యసాయి శ్రీనివాస్‌


చింతపల్లి, సెప్టెంబరు 26: ఉద్యోగ అనుభవాలు సినీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని సినీ నటుడు వి.సత్యసాయి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం సీలేరులో జరుగుతున్న  సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళుతూ చింతపల్లిలో ఆగారు. పంచాయతీరాజ్‌, డీఆర్‌డీఏ ఉద్యోగులు ఆయనను కలిసి గత అనుభవాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా సత్య సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారిగా ఉత్తరాంధ్రలో ఎక్కువ కాలం విధులు నిర్వహించానన్నారు. ఉమ్మడి జిల్లాలో డ్వామా, డీఆర్‌డీఏ పీడీగా పనిచేస్తున్న కాలంలో పాడేరు రెవెన్యూ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించానని తెలిపారు. సినిమాలపై తనకున్న ఆసక్తితో 2019 జనవరిలో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి స్థాయి సినీ జీవితంలోకి అడుగుపెట్టానని చెప్పారు. అధికారిగా పలు ప్రాంతాల్లో పనిచేయడం వల్ల శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, తెలంగాణ, రాయలసీమ ప్రజలు మాట్లాడే యాస బాగా అలవరుచుకున్నానన్నారు. తెలుగు భాషపై మంచి పట్టువచ్చిందన్నారు. అలాగే అధికారులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజల వద్ద ఏవిధంగా ఉండాలి?, ఏవిధంగా విధులు నిర్వహించాలనే విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఉద్యోగంలో నేర్చుకున్న అంశాలన్నీ సినిమా నటనకు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. ఇప్పటి వరకు 44 సినిమాల్లో నటించానని, 16 సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయని చెప్పారు. ప్రస్తుతం 15 సినిమాల్లో నటిస్తున్నాన్నారు. వకీల్‌సాబ్‌, అశోకవనంలో అర్జున కల్యాణం, గీత గోవిందం, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3, మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయన్నారు. హీరో రవితేజతో నటించిన ధమాకా సినిమా దసరాకు రిలీజ్‌ కానున్నదన్నారు. దర్శకులు మంచి అవకాశాలు ఇస్తున్నారని, నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. సినీ జీవితం సంతృప్తికరంగా, ఆనందంగా సాగిపోతున్నదని తెలిపారు. అధికారిగా గిరిజన ప్రాంతాన్ని సందర్శించిన అనుభూతి కంటే నటుడిగా ఈ ప్రాంత పర్యటన కొత్తగా ఉందన్నారు. గిరిజన ప్రాంత పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంత లొకేషన్‌ అద్భుతంగా ఉంటుందని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని సినిమా షూటింగ్స్‌ జరుగుతాయని ఆయన చెప్పారు.


Updated Date - 2022-09-27T06:46:52+05:30 IST