జనసేన నేత కిరణ్ రాయల్ నిర్బంధం
ABN , First Publish Date - 2022-11-12T04:27:47+05:30 IST
జనసేన నేత కిరణ్ రాయల్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం నిర్బంధించారు.
మంత్రి రోజా ఫిర్యాదు మేరకే!
నేడు అరెస్టు ప్రకటించే అవకాశం
తిరుపతి ఎస్పీ కార్యాలయం ఎదుటఆయన భార్య, కార్యకర్తల నిరసన
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 11: జనసేన నేత కిరణ్ రాయల్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం నిర్బంధించారు. గతంలో ఆయన మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారని.. దీనిపై ఆమె మూడు నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం నగరి స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటిస్తారని తెలిసింది. కాగా.. పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడకు తీసుకెళ్లారనే విషయంలో తొలుత గందరగోళం నెలకొనడంతో కిరణ్ రాయల్ సతీమణి రేణుకతోపాటు జనసైనికులు, వీరమహిళలు, కుటుంబ సభ్యులు తిరుపతి ప్రకాశం రోడ్డులోని జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. బందిపోటు దొంగల్లాగా వచ్చి దౌర్జన్యంగా తన భర్తను ఎత్తుకెళ్లారని వాపోయారు. ‘శుక్రవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఓ పోలీసు అధికారి నా భర్తకు ఫోన్‌చేశారు. తిరుచానూరు పోలీసు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు.
ఓ నోటీసు ఇవ్వాల్సి ఉంది.. ఇల్లెక్కడో చెప్పాలని అడిగారు. కొంతసేపటి తర్వాత మళ్లీ ఆ పోలీసు అధికారి కాల్‌చేసి తాను కొత్తగా వచ్చానని, ఎవరినైనా తనవద్దకు పంపించాలని కోరారు. దాంతో ఓ వ్యక్తిని పోలీసు అధికారి ఉన్న ప్రదేశానికి నా భర్త పంపించి ఇంటికి తీసుకొచ్చారు. వారు వచ్చాక ఇంటి వరండాలో మాట్లాడుతుండగానే.. ఉన్నట్లుండి తలుపులు వేసేశారు. మరికొందరు బిలబిలమంటూ వచ్చి నా భర్తను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వెంటనే మేం తిరుచానూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా అక్కడ లేరు. తర్వాత తిరుపతిలోని అన్ని పోలీసు స్టేషన్లలో వాకబుచేశాం. ఆచూకీ లభించకపోవడంతో ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చాం. కిరణ్ ఎక్కడున్నాడో మాకు తెలియజేయాలి. ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పాలి. లేదంటే ఇక్కడినుంచి కదిలేది లేదు’ అని తేల్చిచెప్పారు. తర్వాత కిరణ్ నగరి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని సమాచారం రావడంతో అందరూ అక్కడకు వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, నాయకులు రాజేశ్ యాదవ్, బాబ్జీ, సుమన్‌బాబు, ఆకేపాటి సుభాషిణి, కీర్తన, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కిరణ్ నిర్బంధం రాజకీయ కక్షసాధింపేనని జనసేన నేతలు మండిపడుతున్నారు.