సీ హారియర్‌ సందర్శన భాగ్యమెన్నడో!?

ABN , First Publish Date - 2022-11-30T23:46:12+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వైఖరి ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆర్కే బీచ్‌రోడ్డులో టీయూ-142 మ్యూజియం పక్కన మూడేళ్ల క్రితం ప్రారంభించిన సీ హారియర్‌ మ్యూజియం ఇప్పటికీ పూర్తికాలేదు. అంతా పూర్తయినట్టు కనిపిస్తున్నా...దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఇది పర్యాటక సీజన్‌. ఇంకా ముఖ్యంగా నేవీ డే ఘనంగా జరిగే రోజులు. ఈసారి ఈ వేడుకలకు భారత రాష్ట్రపతితో పాటు నేవీ చీఫ్‌ కూడా వస్తున్నారు. ఈ సమయంలో దీనిని ప్రారంభిస్తే మంచి ప్రచారంతో పాటు ప్రజాదరణ కూడా లభిస్తుంది. కానీ అధికారుల్లో ఆ ఆలోచనే లేదు.

సీ హారియర్‌ సందర్శన భాగ్యమెన్నడో!?
నిర్మాణం పూర్తిచేసుకున్న సీ హారియర్‌ మ్యూజియం

మ్యూజియం ప్రారంభంపై నోరు మెదపని వీఎంఆర్‌డీఏ

ఎన్నాళ్లీ సాగదీత

సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనేనా..?

అంతుచిక్కని అధికారుల తీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వైఖరి ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆర్కే బీచ్‌రోడ్డులో టీయూ-142 మ్యూజియం పక్కన మూడేళ్ల క్రితం ప్రారంభించిన సీ హారియర్‌ మ్యూజియం ఇప్పటికీ పూర్తికాలేదు. అంతా పూర్తయినట్టు కనిపిస్తున్నా...దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఇది పర్యాటక సీజన్‌. ఇంకా ముఖ్యంగా నేవీ డే ఘనంగా జరిగే రోజులు. ఈసారి ఈ వేడుకలకు భారత రాష్ట్రపతితో పాటు నేవీ చీఫ్‌ కూడా వస్తున్నారు. ఈ సమయంలో దీనిని ప్రారంభిస్తే మంచి ప్రచారంతో పాటు ప్రజాదరణ కూడా లభిస్తుంది. కానీ అధికారుల్లో ఆ ఆలోచనే లేదు.

రూ.10 కోట్లని ప్రకటన...

సీ హారియం యుద్ధ విమానాన్ని మ్యూజియంగా మార్చడానికి రూ.10 కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్టు 2019లోనే ప్రకటించారు. ఆర్కే బీచ్‌లో కురుసుర సబ్‌మెరైన్‌, ఎదురుగా టీయూ-142 మ్యూజియం, సమీపంలో నేవీ అమరవీరుల స్మృతి చిహ్నం వంటివి ఉండడంతో ఆ ప్రాంతాన్ని అంతటిని కలిపి సబ్‌ మెరైన్‌ మ్యూజియం కాంప్లెక్స్‌కు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక్కడకు వచ్చేవారికి పార్కింగ్‌ సదుపాయం లేనందున ఇబ్బందులు వస్తున్నాయని, బీచ్‌ రోడ్డులోనే అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ కూడా ఏర్పాటుచేయాలని యోచన చేశారు. వీటన్నింటికీ కలిపి మొత్తం రూ.80 కోట్ల బడ్జెట్‌ వేసుకున్నారు. అయితే అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ వల్ల ఇబ్బందులు వస్తాయని స్థానిక నివాసిత సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో రాజీవ్‌ స్మృతి భవన్‌లోనే సీ హారియర్‌ను వేలాడ దీయాలని నిర్ణయించి, ఆ మేరకు ఆ భవనం పునర్నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్‌+2 విధానంలో భవనాన్ని తీర్చిదిద్ది, క్రేన్‌ సాయంతో విమానాన్ని గాలిలో వేలాడదీశారు. ఇంటీరియర్‌ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది మే నెలలో దీనిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్‌ అయిన కలెక్టర్‌ మల్లికార్జున ప్రకటించారు. ఆ తేదీ దాటి పోయి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటికీ దానికి మోక్షం కలిగించే యోచన చేయడం లేదు. సీఎం చేతులు మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈసారి నేవీ డేకి రాష్ట్రపతితో పాటు సీఎం కూడా వస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దానిని ప్రారంభించాలని నేవీ వర్గాలతో పాటు నగర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈసారి సీఎం రాకపోతే...నగరానికి వస్తున్న రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించినా సముచితంగా ఉంటుందంటున్నారు. రాష్ట్రపతి రక్షణ దళాలకు సుప్రీం కమాండర్‌ అయినందున, యుద్ధ విమాన మ్యూజియం ఆమె చేతులు మీదుగా ప్రారంభించడమే మంచిదని పలువురు సూచిస్తున్నారు. గతంలో టీయూ-142 విమాన మ్యూజియాన్ని కూడా ఇలాగే నాటి రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌తో ప్రారంభింపజేశారు. ఆకర్షణీయంగా రూపొందించిన ఆ మ్యూజియాన్ని చూసి సీ హారియర్‌ను విశాఖపట్నానికి మంజూరుచేశారు. ఈసారి కూడా రాష్ట్రపతి చేతులు మీదుగా ఆ పని కానిస్తే ఇంకో మంచి ప్రాజెక్టు మంజూరుచేసే అవకాశం వుందని నేవీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కోట్ల రూపాయలు వెచ్చించి సిద్ధం చేసిన మ్యూజియాన్ని ప్రారంభించడంలో అనవసర జాప్యం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈ సీజన్‌లో ప్రారంభిస్తే మంచి ఆదాయం వస్తుందని, కనీసం ఆ దిశగానైనా వీఎంఆర్‌డీఏ అధికారులు ఆలోచించి వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2022-11-30T23:46:15+05:30 IST