ఇటొస్తే అంతే సంగతులు

ABN , First Publish Date - 2022-07-18T06:09:52+05:30 IST

మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిలో లోతుగెడ్డ బ్రిడ్జి నుంచి మూలగరువు కొత్తూరు వరకు అధ్వానంగా ఉంది.

ఇటొస్తే అంతే సంగతులు
లోతుగెడ్డ బ్రిడ్జి సమీపంలో గోతులమయంగా ఉన్న రహదారి

- లోతుగెడ్డ- మూలగరువు కొత్తూరు మార్గంలో అడుగడుగునా గోతులు

- వర్షపు నీరు చేరడంతో గుర్తించక ప్రమాదాలు

 - మరమ్మతులు చేపట్టాలని మూడేళ్లుగా స్థానికుల వేడుకోలు

- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


అడుగడుగునా గోతులు.. ఆపై అందులో వర్షపునీరు. ఏది గొయ్యో.. ఏది రోడ్డో తెలియని పరిస్థితి. ఆదమరిస్తే అంతే సంగతి. రాత్రి వేళల్లో అయితే రాకపోకలు చాలా కష్టం. ఇటుగా వస్తే ప్రమాదాలు ఖాయం.. ఇదీ లోతుగెడ్డ- మూలగరువు కొత్తూరు రోడ్డు దుస్థితి. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు స్థానికులు పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా మూడేళ్లుగా కనీసం ఒక్క గొయ్యి కూడా పూడ్చలేదు.

చింతపల్లి, జూలై 17: మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిలో లోతుగెడ్డ బ్రిడ్జి నుంచి మూలగరువు కొత్తూరు వరకు  అధ్వానంగా ఉంది. ఈ రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ఈ ప్రాంతవాసులు  రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గోతులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ రహదారి గుండా చింతపల్లి మండలంలోని బలపం, కుడుముసారి, తమ్మంగుల పంచాయతీలకు చెందిన 89 గ్రామాల ఆదివాసీలు రాకపోకలు సాగిస్తుంటారు. ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రజలకు కూడా ఈ రహదారే ఆధారం. ఈ రహదారిని పదేళ్ల కిందట నిర్మించారు. మూడేళ్లుగా ఈ రహదారి అధ్వానంగా తయారైంది. చిన్న చిన్న గోతులు ఏర్పడిన సమయంలో కనీస మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో వెళ్లాలంటే సర్కస్‌ ఫీట్లు చేసినట్టుగా ప్రయాణం సాగించాల్సి వస్తుంది. సర్వీసు జీపులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఇటుగా రాకపోకలు సాగిస్తే మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రహదారిపై ఏర్పడిన గోతుల్లో వర్షపు నీరు చేరడంతో లోతు ఎంత ఉందో తెలియక వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొత్తగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. 

కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు

మండలంలోని శివారు పంచాయతీలైన బలపం, తమ్మంగుల, కుడుముసారి పంచాయతీల వైపు ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన కొత్తలో చెరువూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆదివాసీలను పరామర్శించేందుకు పాడేరు ఎమ్మెల్యే, వైసీపీ నేతలు ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ ప్రాంతాలను సందర్శించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనైనా తమ గ్రామాలకు అధికార పార్టీ నాయకులు వస్తే రహదారి సమస్యను చెప్పుకోవాలని ఆదివాసీలు ఎదురుచూశారు. అయితే ఈ మూడు పంచాయతీల్లో ఎక్కడ కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించలేదు. 

అర్జీలు ఇచ్చినా స్పందన కరువు

లోతుగెడ్డ- మూలగరువు కొత్తూరు వరకు రహదారి మరమ్మతులు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా మూడేళ్లుగా ఒక్క గొయ్యి కూడా పూడ్చలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన యువత గోతులను ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి తమ గ్రామ రహదారి సమస్యపై వైసీపీ నాయకులు స్పందించి పరిష్కరించాలని ప్రచారం చేశారు. కానీ రహదారి మరమ్మతులు చేసేందుకు అధికారులుగాని, ప్రజాప్రతినిధులు గానీ ముందుకు రాలేదని ఈ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Read more